ఉక్రెయిన్పై మరోసారి రష్యా విరుచుకుపడింది. 24 గంటల్లో మూడు సార్లు ఉక్రెయిన్పై బాంబు దాడులు జరిపింది. తమపై జరిగిన దాడికి ప్రతీకారంగా బాంబుల వర్షం కురిపించినట్లు రష్యా ప్రకటించుకుంది. ఈ ఘటనను ‘కీవ్ ఉగ్రవాద దాడి’గా రష్యా అభివర్ణించింది. అసలేం జరిగిందంటే..
రష్యా రాజధాని మాస్కోపై ఇవాళ డ్రోన్ల దాడి జరిగింది. దీంతో అక్కడి భవనాలు దెబ్బతిన్నాయని రష్యా తెలిపింది. మాస్కోలోకి ప్రవేశిస్తున్న ఎనిమిది డ్రోన్‌లను నిలువరించినట్లు వెల్లడించింది. తెల్లవారుజామున జరిగిన ఈ దాడికి ఉక్రెయిన్నే కారణమని రష్యా ఆరోపించింది. అనంతరం ఈ ఘటనకు ప్రతీకార చర్యగా కీవ్ పై బాంబుల వర్షం కురిపించింది రష్యా.
మాస్కోపై జరిగిన దాడుల్లో పలు భవనాలు దెబ్బతిన్నట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ప్రకటించారు. ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలయ్యాయని.. వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డ్రోన్ దాడిలో దెబ్బతిన్న భవనాల్లో నివసిస్తున్న వారిని రష్యా అధికారులు ఖాళీ చేయించారు. మాస్కోకు వస్తుండగా పలు డ్రోన్లను పేల్చివేసినట్ల తెలిపారు. ఈ నెలలో మాస్కోపై డ్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి.