కాంగోలో బట్టలు ఉతకడానికి వెళ్లిన సమయంలో కొండచరియలు విరిగిపడి 20 మంది సజీవ సమాధి అయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మసీసీ ప్రాంతంలోని బొలోవా అనే గ్రామంలో జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
దాదాపు 25 మంది మహిళలు తమ పిల్లలతో కలిసి కొండ దిగువన ఉన్న ప్రవాహంలో బట్టలు ఉతుకుతున్న సమయంలో.. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో ఇదే ప్రాంతంలోని బిహంబ్వే గ్రామంలో కొండచరియలు విరిగిపడి దాదాపు 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
గతేడాది డిసెంబర్లో కాంగో రాజధాని కిన్షానాను వరద ముంచెత్తింది. ఈ ప్రకృతి విపత్తులో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. భారీ వర్షాలకు వరద ప్రవాహం, మట్టి పెళ్లలు విరిగిపడటం వంటి విపత్తులతో కోటి మందికి పైగా జనాభా ఉన్న కిన్‌షాసా చిగురుటాకులా వణికింది. మరోవైపు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.