హైదరాబాద్ లో మెట్రో రైలు రెండో దశ విస్తరణలో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మార్గంలో మొత్తం 6 స్టేషన్లు రాబోతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రూట్ మ్యాప్ ను పోస్ట్ చేసింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి చింతల్ కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ వరకు స్టేషన్లు రూట్ మ్యాప్ లో పేర్కొంది.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ప్రతిపాదిత కారిడార్ చేపట్టబడుతున్నట్టు తెలిపింది. మియాపూర్-పటాన్ చెరు పొడగింపు, కారిడార్ 1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఇప్పటికే అమలుతో ఉండటంతో హయత్ నగర్ వైపు కొత్త మార్గం కలిపి పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు నగరం వాయువ్య చివర నుంచి ఆగ్నేయ చివరి వరకు దాదాపు 50 కిలోమీటర్లు సజావుగా కనెక్టివిటీని తెస్తుందని పేర్కొంది.