బస్సు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 49 మంది ఉన్నట్లు తెలిసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
అసలేం జరిగిందంటే..? థాయ్‌లాండ్ ప్రచౌప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో 49 మంది ప్రయాణికులతో ఓ బస్సు బ్యాంకాక్ నుంచి సోంగాఖ్లా ప్రావిన్స్‌కు బయల్దేరింది. ఈ క్రమంలోనే వనకోర్న్ జాతీయ పార్క్‌కు చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది థాయ్‌కు చెందినవారు ఉన్నారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు.