అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే.. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని తెలిపారు. ఐసిస్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్టు చేసిన వేళ మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అమెరికా ఇప్పుడు పడినంత ప్రమాదంలో ఎప్పుడూ లేదని ట్రంప్ అన్నారు. వేలాది మంది ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని.. దీనికి అనేక ఏళ్లపాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటరు ఛాయిస్ సుస్పష్టం అని వ్యాఖ్యానించారు. వేలాదిమంది రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా? లేదా అటువంటి వారిని దేశం నుంచి బయటకు పంపించే అధ్యక్షుడు కావాలా? అనేది నిర్ణయించుకోండి అని ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ను మొదలుపెడతానని ట్రంప్ హామీ ఇచ్చారు.