ప్రస్తుతం దేశమంతా చర్చిస్తున్న అంశం.. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం. దీనికి కొందరు మద్దతిస్తుండగా.. మరికొందరేమో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు మోదీ తీరుని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా పేరు మార్పు అంశంపై రాజకీయంగా దుమారం చెలరేగిన వేళ దీనిపై ఐక్యరాజ్య సమితి స్పందించింది.
పేరు మార్పుపై దేశాల నుంచి అభ్యర్థనలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని యూఎన్ అధికారులు తెలిపారు. గత ఏడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఐరాస అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ ఉదహరించారు. ఆ దేశం నుంచి వచ్చిన అధికారిక అభ్యర్థనపై ఐరాస సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆయా దేశాల నుంచి పేరు మార్పుపై అభ్యర్థనలు వస్తే వాటిని వెంటనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. జీ20 సదస్సు కోసం పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంతో పేరుమార్పు అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.