ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు హమాస్‌ను నాశనం చేయాలని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులతో విరుచుకు పడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ఇజ్రాయెల్‌పై దాడి నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్‌కు చెందిన 10మంది సభ్యులతోపాటు గాజా, సుడాన్, తుర్కియే, అల్జీరియా, ఖతార్‌లోని ఆ సంస్థకు చెందిన ఆర్థిక మూలాలపై అమెరికా ఆంక్షలు విధించింది.
హమాస్ పెట్టుబడుల పోర్టుపోలియో నిర్వహణ, ఇరాన్ ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలు కలిగిన ఖతార్‌కు చెందిన ఫైనాన్సియర్, హమాస్ కీలక కమాండర్, గాజా కేంద్రంగా వర్చువల్ కరెన్సీని మార్పిడిదారు లక్ష్యంగా ఆంక్షలు విధించినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల నేపథ్యంలో.. హమాస్ ఫైనాన్సియర్స్, ఫెసిలిటేటర్లపై వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నట్లు.. అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్ తెలిపారు. అంతర్జాతీయ వ్యవస్థల ద్వారా హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా అడ్డుకుంటామని అమెరికా సహాయ మంత్రి బ్రియాన్ నెల్సన్ తేల్చి చెప్పారు.