ఈ ఏడాది నవంబరులో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అమెరికాలో ప్రచారం ఉద్ధృతంగా మారింది. డెమోక్రాటిక్ పార్థీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లిక్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్యే పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో కాస్త జోష్ పెంచిన జో బైడెన్.. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని జో బైడెన్ ఆరోపించారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని తెలిపారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకు వచ్చి ‘మీరే గెలవాలి’ అని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పారు. అలా అయితేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు భావిస్తున్నారని జో బైడెన్ పేర్కొన్నారు.