ఆమె అవ‌ని.. గెలిచే ధిక్కార ప‌తాక

-

ఓ జాతికి మ‌నుగ‌డ
ఓ జాతి త‌లెత్తుకున్న తేజం
ఓ జాతి క‌డ‌దాకా  చ‌వి చూసిన ఫ‌లితం
అన్నీ అన్నీ ఆమె.. అంతా అంతా ఆమె..
ఆ దిక్కుకు ఓ మొక్కు చెల్లించాలి..
 ఆ కీర్తి ప‌తాక‌కు మోక‌రిల్లాలి
ఆ ధిక్కార స్వ‌రాన్ని అంగీక‌రించాలి

కొన్ని అంకెలు తారుమారు అవుతాయి.. జాత‌కాలు బోర్లాప‌డ‌తాయి.. పుస్త‌కాలు వెలుగులు కొత్తందం అందుకుంటాయి.అప్పు ప‌డ్డ కాలం తీర్చాల్సినంత తీర్చి మిగిలిన రుణం వాయిదా కోరుకుంటుంది. ఆమె ఏం అనుకుంటే అది అయ్యే రోజు ఎప్ప‌డూ ఉండ‌నే ఉంటుంది.ప్రత్యేకమైన రోజు ప్ర‌త్యేక‌మైన కాలం ఏముంద‌ని..

ఓడిపోయాను నేను ఓడిపోయాను ఇలా నీవు నేనూ అనుకోవాలిక‌. సైనా రాకెట్ వేగంగా దూసుకుపోతున్న‌ప్పుడో.. పూర్ణ పాదాలు కొండ శిఖ రాన్ని ముద్దాడిన‌పుడో.. జీవితంలో ఇంకా ఓడిపోయే సంద‌ర్భాలు వ‌స్తూనే ఉండాలి.. నీకూ నాకూ జ‌న్మ‌స్థానంగా నిలిచిన స్థానం ప‌దిలం కావాలం టే ఇంకొంచెం ఆమె ముందు ఓడిపోవాలి.. ఇలానే రాస్తున్నాడిప్పుడు అత‌డు, ఆమె చ‌రిత‌ను.. మ‌నిషి ఓ యుగంలో గెలిచి యుగాంతంలో విశ్రాంతి తీసుకుంటాడు. కానీ ఆమె యుగ పురుషుడ్ని సైతం న‌డిపించి తానే అంతా అని చెప్ప‌క‌నే చెబుతుంది వెనుక ఉండి న‌డిపించే న‌డ‌క క‌న్నా తానే అత‌డై న‌డిపించే న‌డ‌క ఓ జీవిత కాల చ‌క్రాన్ని ఎంత‌గా మారుస్తుందో..

అత‌డూ ఆమె ఇద్ద‌రూ వ్య‌క్తావ్య‌క్తాలు.. ఒకరికోసం ఒక‌రు అన్నంతగా జీవిస్తారు. జీవితంలో పెన‌వేసుకున్న బంధాల‌కు అర్థ‌వంతంగా నిలుస్తారు.ఇలా నిల‌వ‌డాన్ని మ‌నం గెలుపు అనాలి ఇది సాంసారిక గెలుపు.. అత‌డు ఆమె,. ఓ ప‌చ్చ‌ళ్ల వ్యాపారం.. దిగులు ఇంటి చుట్ట‌మైంది..బాధ నేస్తం అయ్యింది.. క‌న్నీరు కొంగున క‌ట్టి రాణించిన ఆమె అత‌డుగా మారిపోయింది.. అత‌డు ఆమె పాదాల కింద మెత్త‌టి నేల‌గా మారిపోయాడు క‌నుక మార్పు ఎంత అనివార్య‌మో క‌దా!

వ‌ర‌ల్డ్ క‌ప్ తేలేనందుకు మిథాలిని మ‌నం ఏమీ అన‌వొద్దు.. ఎందుకు అంటే ఆ క‌ష్టం అలాంటిది క‌నుక మ‌న వీధి చివ‌ర అలాంటి క‌ష్టం ఎంద‌రెంద‌రో భ‌రిస్తున్నారు క‌నుక‌.. కొన్నిసార్లు ఓట‌మిని పండుగ‌గా మ‌లుచుకోవాలి. ఈ దేశం ఆమెని చూస్తే గ‌ర్వ‌ప‌డింది.. కాదు ఆ స్థాయికి చేరుకునేందుకు అమ్మ సాయ‌ప‌డింది.క‌నుక త‌లెత్తుకునే ఓట‌ములు కొన్ని జీవితాన్ని ప‌ల‌క‌రించాలి. అలాంటి సంద‌ర్భాలు జీవితాల్లోకి ఆహ్వానించాలి. ఇప్పుడు చెప్పండి ఆమె ఓడిపోయిందా..!

pic credit  : uma nutakki

సినిమా బాగా రాలేదు అస్స‌ల‌స్స‌లు న‌చ్చ‌లేదు.. కానీ ఓ మ‌నిషి క‌ష్టం అంతా మాట్లాడుకున్నారు.. ఆమెనె ర‌జ‌నీ కాస్ట్యూమ్ డిజైన‌ర్ అనూ వ‌ర్థ‌న్ సినిమా రాక ముందే ద‌క్షిణ భార‌తావ‌ని ఆమె ప్ర‌తిభ‌ని ప్ర‌సంసించింది. అంత‌కుమునుపు షారూక్‌తో అశోక సినిమా తీస్తున్నారు. క‌రీనా హీరో యిన్‌. కెమెరా స‌ంతోష్ శివ‌న్‌. రోజూ సెట్స్‌లో అడుగిడుతోంది. తానే ఒక సెల‌బ్రిటీ అన్నంతగా ఫీల‌వుతోంది. త‌న‌ని తాను కొంచెం ఎక్కువ‌గా ప్రేమించుకుంటోంది. ఈ ప్రేమ డ్రెస్సింగ్‌లో కొంత, బిహేవియ‌ర్‌లో ఇంకొంత క‌న‌బ‌డుతోంది.

‘ఇంకేం.. నువ్వే కాస్ట్యూమ్ డిజైన్స్ చేయొచ్చుగా’ అన్నారు సంతోష్ శివ‌న్‌. బాప్ రే అనుకుంది అనూ. త‌రువాత బాపూ గారి బొమ్మ‌ల కొలువులో కాసింత చోటు ద‌క్కాక బాపూ రే ర‌మ‌ణీయంలా మారిపోయింది ఆమె జీవితం. సీత‌మ్మోరి దీవెన అందుకున్నాక క‌ల‌ల‌కు కొత్త రంగుల‌ద్దుకున్నాయ్‌! ఊహ‌లు ఉలుకులు, ప‌లుకులు నేర్చి.. ఉరుకులు ప‌రుగులు పెట్టాయ్‌. ఆర్క్ లైట్ వెలుతురులో వీస్తోన్న గాలి ఆమె డిజైన్ చేసిన జ‌రీ అంచును సైతం రెప‌రెప‌లాడిస్తోంది.

క‌ల‌నేత‌లోనే కాదు త‌ల‌పోత‌లోనూ కొత్తందం ఉంద‌ని చాటిచెబుతూ..! నిజంగా అది విజ‌య‌ప‌తాక‌! అది కీర్తి ప‌తాక‌! అందుకోండి అనూని! పల‌క‌రించండి మిసెస్ వ‌ర్థ‌న్‌ని! గోదారి తీరాన పుట్టిన విష్ణూ తెలుగువాడే. ఆ ఇంట ఇప్ప‌టికీ తెలుగు మాట్లాడ‌తారు. అలా ఈ నేల‌తో త‌న‌కు అనుబంధం ఉంద‌ని చెబుతుందామె. కాసింత గ‌ర్వంగా.. కూసింత విన‌యంగా..ఇలాంటి వారిదే గెలుపు!

సాయంత్రం ఆరుగంట‌ల‌య్యింది.. కొడుకు పాఠ‌శాల నుంచి వ‌చ్చేశాడు..లెక్క‌ల పుస్త‌కం చూసి ఆమె ప‌డ‌రాని పాట్లు ప‌డుతోంది. ఓ సాధార‌ణ గృహిణి ఆమె.ఏం చేస్తుంది..నేర్చుకున్న‌దంతా బుజ్జాయికి నేర్పుతుంది.మ‌న జీవితాల్లో పెద్ద‌వారే కాదు ఇలాంటి  సామాన్యులు  కూడా ఆద‌ర్శ‌మే అని నిరూపిస్తోంది. ఈమెను ఏమి అనాలి .. ఆద‌ర్శ గృహిణి అనాలి.. ఇలాంటి వారు మ‌న ఇంటి మూల ధాతువులు .. వారిని ర‌క్షించుకుని వారికి కాస్తైనా ఆనందాన్నిపంచి ఈ మ‌హిళా దినోత్స‌వాన అంతా అంతా ఆమెకు మోక‌రిల్లి జేజేలు చెప్పాలి.. గొప్ప‌వారికే కాదు గొప్ప‌వారిని సామాన్యులుగా మలిచిన వారికి కూడా.. కంప్లీట్ విమెన్ ఈ మాట ఇంకాస్త రుజువుకు నోచుకోవాలి. అంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Exit mobile version