నీ కాళ్లను పట్టుకొని వదలనన్నవి చూడే మా కళ్లు అంటూ అభిమానులను ఆకట్టుకునే అందం ఆమెది. జిల్ జిల్ జిగేలు రాణి.. అంటూ కుర్రకారు హుషారుగా పాడుకునేలా చేసిన సోయగం ఆమెది. ఆ పొడుగుకాళ్ల సుందరే పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలు, బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ పూజాహెగ్డే. ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూజా ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’, ‘సాక్ష్యం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’, ‘రాధేశ్యామ్’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌తో కలిసి జిగేల్‌రాణిగా ఐటమ్ సాంగ్‌లో తనదైన స్టెప్‌లతో అలరించింది. ఆ తర్వాత ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్’, విజయ్‌తో కలిసి ‘బీస్ట్’, ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌కు జోడీగా కనిపించి ఆకట్టుకుంది. ఇక హిందీలో ‘సర్కస్’, ‘భాయీజాన్’, మహేశ్ ‘ఎస్ఎస్ఎమ్బీ 28’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ‘దువ్వాడ జగన్నాథం’, ‘మహర్షి’ చిత్రాలకు గానూ జీ గోల్డెన్ అవార్డ్స్, జీ సినిమా అవార్డ్స్‌ను ఫేవరెట్ నటిగా అవార్డు అందుకుంది.
పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. అమ్మానాన్నలు వృత్తిరీత్యా మంగళూరు నుంచి ఎప్పుడో ముంబయి వచ్చేశారు. వారి ఇంట్లో పద్ధతులు మాత్రం దక్షిణాది వాతావరణాన్నే గుర్తు చేస్తుంటాయి. పూజా కుటుంబానికి సినిమా రంగంతో అసలు ఎలాంటి సంబంధం లేదు. అప్పట్లో అబ్బాయిలాగా కటింగ్ చేయించుకుని టామ్ బాయ్‌లా కనిపించేదట. స్కూల్‌లో మాత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదట.
అందాల పోటీలతోనే గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టాను. ఒకవేళ నటిని కాకపోయుంటే ఫ్యాషన్ ప్రపంచంలోనే కొనసాగేదాన్నేమో అని ఓ సారి తెలిపింది. సోషల్ మీడియా అంటే బాగా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడు పుస్తకాలు చదవడం.. సినిమాలను బాగా చూడటం చేస్తుంటుంది. ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రతిరోజునీ ఆస్వాదిస్తా అని చెబుతుంటుంది. షాపింగ్ అంటే ప్రాణమని.. విదేశాలకు వెళ్లినప్పుడు నచ్చినవన్నీ కొనేస్తుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తుళుతో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు భాషలు వచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తుంటుంది. అందం గురించి ఆలోచించినప్పటికీ ఆహారానికి మాత్రం దూరం కాదు. దక్షిణాది వంటకాల్ని అమితంగా ఇష్టపడుతుంది.
ప్రయోగాలకీ దూరంగా ఉంటూ ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా తనకు సూట్ అయ్యే గ్లామర్ పాత్రలతో సరదా సరదాగా సినిమాలు చేసుకుంటూ పోవడ మంటే ఇష్టమట. కెరీర్లో ఎప్పుడు ముందుకు పరిగెడుతూనే ఉండాలి అని చెబుతుంటుంది. గెలిచాక కూడా అంతా అయిపోయినట్టు కాదు. సాధించాల్సింది మన ముందు ఇంకొకటేదో ఉంటుంది. దానిపై దృష్టి పెట్టాల్సిందే. అందుకు నా వాట్సాప్ డీపీలో ‘గెలిస్తే అయిపోయినట్టు కాదు’ అని రాసుకున్నా అని ఓ సారి చెప్పింది. ఓ సందర్భంలో తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. నేను ప్రేమ కథా చిత్రాలు చేసింది తక్కువ.. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ప్రేమ కథలు లేవు.
ఇప్పటివరకూ నాకైతే ఒక్క ప్రేమ లేఖా రాలేదు. కాలేజీ రోజుల్లో నేను చాలా సిగ్గరి. ఇప్పుడేమో సినిమాలతో తీరిక లేదు. భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు’ అని పేర్కొంది. ‘ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో ప్రణాళికలేమీ ఉండవు. సమయం వచ్చినప్పుడు జరిగిపోతుంటాయంతే. ప్రస్తుతానికి ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదు. అలాగని భవిష్యత్‌లో ప్రేమలో పడననీ చెప్పలేను. పెళ్లి గురించి కూడా అంతే అని గతంలో ఓ సారి తన పెళ్లి గురించి చెప్పింది.
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ నా ఫేవరెట్ ప్లేయర్స్.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం, జెన్నిఫర్ లోపెజ్ పాటలంటే ఇష్టం. ‘సంగీతమే నా ఒత్తిడి తగ్గించే థెరపీ. అదే నా బెస్ట్ ఫ్రెండ్. నేను నిరాశలో ఉన్నప్పుడు ఎక్కువగా సంగీతం వినేదాన్ని. మనసులో ఏదీ పెట్టుకోకుండా ఏడవటం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఐదు నిమిషాల్లో ఇవన్నీ చేసి, మళ్లీ పనిలో నిమగ్నమవుతా’ అని తెలిపింది. కెరీర్లో నెం.1 పొజిషన్ గురించి మాట్లాడూతూ… ‘ఇండస్ట్రీలో నంబర్స్ గేమ్ ఎప్పుడూ ఉంటుంది. నా దృష్టిలో నం.1 అనేది ఒక మాయ. అలా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. దాని కోసం నేను వర్క్ చేయడం లేదు. ఒక చరిత్ర సృష్టించాలని పనిచేస్తున్నా. నా సినిమాలతో ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపాలని భావిస్తున్నా’ అని చెప్పింది.