యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ నేపథ్యంలో అటు ఫ్రాంచైజీలకు, ఇటు బీసీసీఐకి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నీని పూర్తిగా బయో సెక్యూర్ బబుల్‌లో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుండగా.. అందుకు ఫ్రాంచైజీలు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నాయి. అలాగే ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇవ్వాలని భావిస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)లోనూ పలు మార్పులు చేయాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీ నిర్వహణ విషయంలో అటు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు, ఇటు బీసీసీఐకి మధ్య పలు విభేదాలు వచ్చాయని తెలిసింది.
యూఏఈకి చేరుకోగానే ప్లేయర్లందరినీ 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు మాత్రం అందుకు 3 రోజులు సరిపోతుందని చెబుతున్నాయి. ఇక యూఏఈకి ఆగస్టు 20వ తేదీ తరువాత వెళ్లాలని బీసీసీఐ ఫ్రాంచైజీలకు సూచిస్తుండగా, ఫ్రాంచైజీలు మాత్రం ఆగస్టు 15నే అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాయి. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే ప్లేయర్లను ఎంత వీలైతే అంత త్వరగా జట్టులోకి చేర్చుకోవాలని ఫ్రాంచైజీలు ఆలోచిస్తుండగా.. బీసీసీఐ అన్ని సేఫ్టీ సూచనలు, నిబంధనలను పాటించాలని అంటోంది.
ఇక బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్న వారు ఎవరూ బయటి వ్యక్తులకు కలవరాదని బీసీసీఐ ఖరాఖండిగా చెబుతుండగా.. ఫ్రాంచైజీలు మాత్రం తాము 80 రోజులు బయటి వ్యక్తులను కలవకుండా ఉండలేమని, కుటుంబ సభ్యులతో డిన్నర్లకు అనుమతివ్వాలని కోరుతున్నాయి. ప్లేయర్లు స్టేడియాలకు, హోటల్స్‌కు పరిమితం కావాలని బీసీసీఐ అంటుండగా.. వారిని ఇతర క్రీడలు ఆడేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు, బయటి వ్యక్తులను కలిసేందుకు అనుమతివ్వాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి.
టోర్నీ సమయంలో ప్లేయర్లు బయో సెక్యూర్ బబుల్ దాటి బయటకు వెళ్లకూడదని బీసీసీఐ కచ్చితంగా చెప్పగా.. ఫ్రాంచైజీలు మాత్రం ప్లేయర్లకు యాడ్ షూటింగ్స్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించాల్సి ఉంది. టోర్నీ నేపథ్యంలో కఠిన నిబంధనలతో మ్యాచ్‌లను నిర్వహిస్తుందా, లేక ఫ్రాంచైజీల ఒత్తిడికి తలొగ్గి నిబంధనలను సడలిస్తుందా.. అన్న విషయాల్లో స్పష్టత రావాలంటే కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే.