ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎనభైశాతం విజయావకాశాలు తమవే అని అంటున్నారు యోగీ.అదే నిజం అయితే రానున్నకాలంలో మోడీ మళ్లీ ప్రధాని కావడం తథ్యం. కానీ ఇబ్బంది అంతా సున్నిత అంశాలనే తమ పెట్టుబడిగా ఉంచి, చీకటి రాజకీయాలను ప్రోత్సహిస్తూ వస్తున్న పార్టీలు తమదైన కట్టడి చేయకపోగా ఒకరినొకరు తిట్టిపోసుకోవడమే పెద్ద విడ్డూరం.
ఈ నేపథ్యంలో యూపీ సీఎం జోక్ వేశారు. అసలు ఉత్తరప్రదేశ్ అనేకాదు ఎక్కడ కూడా ఇవాళ కుల పోరు,మతం హోరు లేనిది లేదు. కానీ అక్కడ వాటికి చోటే లేదని అంటున్నారు. అంటే రానున్న కాలంలో అంతా ఏక తాటిపైకి వస్తే ఇక మతతత్వ రాజకీయాలు అన్నవి ఉండనే ఉండవు అని చెబుతున్నారా?
అందరితో కలిసి అందరి అభివృద్ధి అనే నినాదంతో ఉత్తర ప్రదేశ్ లో యోగీ ఆదిత్య నాథ్ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇదే నినాదం కారణంగా తాము ఎన్నో మంచి పనులు చేయాలని తలపోస్తున్నామని కూడా అంటున్నారు.ఉత్తర్ ప్రదేశ్ కు మేలు చేసేది తామేనని మరోసారి ఇదే రుజువు కానుందని అనే అర్థం వచ్చే రీతిలో మాట్లాడుతున్నారు కూడా! ఇవన్నీ బీజేపీ ఇమేజ్ ను పెంచుతున్నాయా లేదా ఎస్పీ హవాకు చెక్ పెడుతున్నాయా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.తాము మాత్రం ఎప్పటికీ కులవర్గ పోరుకు అతీతంగానే ఉంటామని అంటున్నారు యోగీ. మా ఎజెండాలో కులం, మతం అన్నవి ఉండవని అంటున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్.అదే నిజం అయితే ఎందుకని మత సంబంధ వివాదాలు తరుచూ జరుగుతున్నా యని, ఎందుకని సున్నిత అంశాలనే కేంద్రంగా చేసుకుని రాజకీయాలు నడుపుతున్నారని?
ఆ రోజు యోగీకి ఈ రోజు యోగీకి పెద్ద తేడా ఏం లేదు. అప్పుడూ ఇప్పుడూ ఆయన నమ్మకుంటున్నదే మతతత్వ రాజకీయాల ను. సున్నితం అయిన అంశాలపై వివాదాలు రాజేసి ఎప్పటి నుంచో బీజేపీ తనవంతు లబ్ధి అందుకుంటోంది అన్న విమర్శ అయి తే ఉంది.ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియాతో మాట్లాడిన యోగీ.. మా అజెండాలో జాతీయ వాదం, అభివృద్ధి అన్నవి ఉన్నాయని, కుల, మత వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరి శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు.
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ బీజేపీ ఎందుకని జాతీయ వాదాన్ని దిగువ స్థాయి వరకూ తీసుకుని వెళ్లలేకపోతోందని? ఎందుకని మైనార్టీ ఓట్లను రాబట్టు కోలేకపోతోందని? వీటిపై కూడా ఆలోచిస్తే..అదే పనిగా ప్రాంతీయ పార్టీలను తిట్టిపోవడం ద్వారా కొంత రాజకీయ లబ్ధి పొందవచ్చన్నది బీజేపీ ప్లాన్.ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీలో మాఫియా కదలికలు ఉన్నాయని ఆరోపిస్తున్న సీఎం మరి! వారిని అధికారంలో ఉండగా ఎందుకని అరెస్టు చేయలేకపోయారని? అల్లర్లకు,హింసకు కారణం అయిన వారిని ఎందుకని జైలు బాట పట్టించలేకపోయారని? ఇవి కూడా ఇవాళ వెలుగు చూస్తున్నాయి.