గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో కులాల వారీగా ఓట్ల వేటలో నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ తరఫున ప్రచారం చేస్తానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంట్రీతో రాజకీయంగా మరింతగా క్యాస్ట్ పాలిటిక్స్ పుంజుకున్నాయని అంటున్నారు. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీకి చెందిన కాపు సామాజిక వర్గం(ఓట్లు స్వల్పమే అయినా.. ప్రభావం ఎక్కువనే అంచనాలు ఉన్నాయి) ఆయన పిలుపు మేరకు బీజేపీకి పడతాయా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో కాపుల ఓట్ల ప్రాధాన్యం ఎటు? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.
అయితే, ఈ విషయంలో కాపు నాయకుల నుంచి రెండు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకటి కేసీఆర్‌కు అనుకూలంగా, రెండు పవన్‌కు వ్యతిరేకంగా.. ప్రభుత్వ పథకాల్లో తమకు ప్రాధాన్యం ఉంటోందన్నది కాపు వర్గంలోని కీలక నేతల మాట. అన్ని విధాలా కేసీఆర్ తమకు రక్షణ ఉందని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉందని చెబుతున్నారు. అదేసమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్.. కాపులను మైమరపించే ప్రయత్నం చేస్తాడని, బీజేపీకి మద్దతు ప్రకటించిన పవన్.. తమ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ముఖ్యంగా యువతలో ఈ ప్రచారం ఎక్కువగా ఉండడం గమనార్హం. పవన్ అన్ని విధాలా విఫలమైన నాయకుడనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. అంతేకాదు, ఆయనకు రాజకీయాలు చేతకావని, ఏపీలో ఒక్క చోట కూడా విజయం సాధించలేదని, పైగా పార్టీని కూడా సొంతంగా నిలబెట్టుకోలేక.. బీజేపీతో కలిసి నడుస్తున్నాడనే విమర్శలు ఊపందుకోవడం గమనార్హం. దీంతో పవన్ మాటలను ఎవరూ నమ్మొద్దనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు… ఆయన కాపుల పక్షాన ఏమైనా మాట్లాడాలంటే.. ఏపీకి వెళ్లి మాట్టాడుకోమనండి.. అంటూ కూడా విమర్శలు వస్తుండడం గమనార్హం.
అదే సమయంలో కాంగ్రెస్ వైపు కూడా కాపులు చూడడం లేదు. గతంలో కాంగ్రెస్‌కు కాపులు మద్దతు పలికారు. అయితే.. ఇప్పుడు ఆ పార్టీలో నేతలకే దిక్కులేకపోవడం.. ఎక్కడికక్కడ వివాదాలు, విభేదాలతో నాయకులు కాపురం చేస్తుండడంతో వారివైపు కూడా కాపుల చూపు పడడం లేదు. దీంతో కాపుల ఓటు బ్యాంకు స్వల్పంగానే ఉన్నా.. ఎటు మొగ్గుతుందోనని నాయకులు తల్లడిల్లుతుండడం గమనార్హం. పవన్ ఎంట్రీతోనే వీరి ఓటుకు ప్రాధాన్యం పెరగడం గమనార్హం.