పిల్లలకు స్వేచ్చ అంత మంచిది కాదా…?

-

పిల్లలకు స్వేచ్చ అంత మంచిది కాదా…? సమాజంలో నేరాలు ఘోరాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయని తల్లి తండ్రులు టీవీలు చూస్తూ ఎంతో ఆవేదనగా మాట్లాడుతూ ఉంటారు. తమ పిల్లలు చేస్తున్న పనులను గాని వాళ్ళు తిరిగే తిరుగుళ్ళను గాని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయరు. మా పిల్లలు బంగారు తల్లులు అంటూ వెనకేసుకుని వస్తూ పక్కింట్లో నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు.

అయితే తమ పిల్లలకు తాము ఇస్తున్న స్వేచ్చ గురించి మాత్రం ఆ తల్లి తండ్రులు కనీసం ఆలోచించే ప్రయత్నం చేయడం లేదు. పిల్లలు అడిగిన వెంటనే బండి కొనడం, ఫోన్ కొనడం, ఎక్కడికి అడిగితే అక్కడికి పంపించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలకు ఈ సదుపాయాలు మరింత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వేలకు వేలు డబ్బులు ఇస్తూ ఉంటారు.

తమ పిల్లల మీద ఉన్న గుడ్డి నమ్మకమో లేక ధీమానో మరొకటో తెలియదు గాని మా పిల్లలు ఏమీ చేసే అవకాశం లేదని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఉదయం అబ్బాయి ఫోన్ చేసాడు… కాలేజీకి వెళ్ళాడు. సాయంత్రం ఫోన్ చేసాడు కాలేజి నుంచి వచ్చాడు. మా అబ్బాయికి బండి కొన్నాం ఇంటి నుంచి వెళ్ళాడు, మా అబ్బాయి బుద్ధిగా చదువుకుని ఇంటికి వచ్చాడు.

ఈ మధ్యలో జరిగే ప్రక్రియలు, కార్యక్రమాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ముఖ్యంగా డబ్బున్న పిల్లల తల్లి తండ్రుల వ్యవహారశైలి దారుణంగా ఉంది. పిల్లల గురించి ఆలోచించడమే మానేశారు. డబ్బుల కారణంగా వాళ్ళు అలవాటు పడుతున్న వ్యసనాలు, చేస్తున్న పనులు, చేస్తున్న సావాసాలు అన్నీ కూడా ఇప్పుడు ఒకసారి ఆలోచి౦చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మీరు చదివిన రోజుల పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు. మీరు అనుకున్న విధంగా ఏ ఒక్కటి ఉండటం లేదు జరగడం లేదు. విద్యార్ధి సంఘాల నుంచి మాదక ద్రవ్యాల స్నేహాల వరకు మీ పిల్లలు చెడిపోతున్నారు. అవును ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్మాలి అనుకున్నా నమ్మలేకపోయినా పచ్చి నిజం. పిల్లలు… పిల్లలు కాదు. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా పక్క వారి జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు.

ప్రేమ పేరుతో కనపడని విధ్వంశం చేస్తున్నారు. సమాజంలో మీకంటూ ఏర్పరుచుకున్న గుర్తింపు పోవడానికి వాళ్ళు చేస్తున్న పనులే కారణం. గతంలో తల్లి తండ్రులను చూసి పిల్లలు గొప్ప వాళ్ళు అనుకునే వారు. ఇప్పుడు పిల్లలను చూసి తల్లి తండ్రులు గుణం లేని వారేమో అనుకునే పరిస్థితి వచ్చింది. మీ కోట్ల సంపద సమాజ విధ్వంశానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గ్రహిస్తే మంచిది.

గతంలో విద్యార్ధులు అంటే సిగరెట్స్, మద్యం. కాని ఇప్పుడు డ్రగ్స్, అమ్మాయిలూ, అంటూ కొన్ని వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు. తల్లి తండ్రులు తమ పిల్లల గురించి ఒకటికి పది సార్లు ఆలోచిన్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు స్వేచ్చ అనేది ఏ విధంగాను మంచిది కాదు. అడిగినన్ని డబ్బులు ఇవ్వడం కూడా ఎంత వరకు శ్రేయస్కరం కాదు అనేది వాస్తవం.

Read more RELATED
Recommended to you

Exit mobile version