తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. తెలంతల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేవిధంగా చూపించడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
తెలంగాణ తల్లి విగ్రహంపై బహిరంగ ప్రదేశాల్లో, ఆన్లైన్లో, సామాజిక మాధ్యమాల్లో, మాటలు, చేతలతో అగౌరవపర్చడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపర్చడం నేరంగా పరిగణించబడుతుందని సీఎస్ శాంతికుమారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక, సంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం ఆలోచించిందని.. వీటన్నిటి ప్రతిబంబించేలా ప్రత్యేక చిహ్నాలు కలిగిన విగ్రహాన్ని ప్రభుత్వం ఆమోదించిందని తెలిపింది.తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ,ఆత్మగౌరవ ప్రతీక అని ఆమె అన్నారు.