కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో అనేక మంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి ఉద్యోగాలు, ఉపాధి పోయింది. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఉద్యోగులైతే పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారు. అలాగే ఈఎంఐలు చెల్లించలేక మారటోరియం సదుపాయం తీసుకున్నారు. మరోవైపు బ్యాంకులు మాత్రం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించినా లోన్లు, క్రెడిట్ కార్డులను కొత్తగా ఇవ్వడం లేదు. అయితే ఈ విషయంలో ముందు ముందు వినియోగదారులకు మరిన్ని కష్టాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇకపై కొత్తగా పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డులకు అప్లై చేస్తే అంత సులభంగా వాటిని పొందలేరని, క్రెడిట్ హిస్టరీ బాగుంటే తప్ప వాటిని పొందే అవకాశం ఉండదని.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ 2008-09 ఆర్థిక మాంద్యం వచ్చినప్పటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఓ నివేదికను రూపొందించింది. దాని ప్రకారం.. వినియోగదారులు ప్రస్తుతం హోం లోన్ల ఈఎంఐలను చెల్లించేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, తరువాత వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, చివరిగా క్రెడిట్ కార్డు చెల్లింపులు చేస్తున్నారని.. కనుక వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులకు వారు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తేలింది. దీంతో బ్యాంకులు పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులను ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి.
ఇక సిబిల్ వెల్లడించిన నివేదిక ప్రకారం… కేవలం క్రెడిట్ హిస్టరీ బాగుండే వారికే భవిష్యత్తులో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులను అందజేస్తారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులను సక్రమంగా చేసే వారికే అధిక ప్రాధాన్యత ఉంటుంది. సిబిల్ స్కోరులో ఆ చెల్లింపుల వివరాలను గమనించాకే ఆర్థిక సంస్థలు రుణ లేదా క్రెడిట్ కార్డు సదుపాయాలను అందజేస్తాయి. ఇక ఓవరాల్‌గా మనకు అర్థమైంది ఏమిటంటే.. రానున్న రోజుల్లో గతంలోలా సులభంగా రుణాలను మాత్రం పొందలేం. అది మాత్రం గ్యారంటీ.. మరి ప్రజలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ ఎత్తున రుణాలు అందజేస్తామంటూ.. కేంద్రం ఆర్భాటంగా రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీనైతే ప్రకటించింది కానీ.. ఈ విషయంపై దృష్టి సారిస్తుందో, లేదో చూడాలి.