కరోనా నేపథ్యంలో భారత్‌లో జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. 24 రోజుల్లో మొత్తం 60 లక్షల మందికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి దశలో మొత్తం 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో మార్చి చివరి వారం వరకు తొలి దశ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్లను ఇవ్వడం వృథా అని పలువురు సైంటిస్టులు అభిప్రాయ పడ్డారు.
కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో సహజంగానే యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్నారు. అవి దీర్ఘకాలం పాటు సహజసిద్ధంగా కోవిడ్ నుంచి రక్షణను అందిస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 44 మాత్రం కోవిడ్ రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, అందువల్ల ఒక్కసారి కోవిడ్ వచ్చిన వారు కోలుకుంటే వారికి మళ్లీ కోవిడ్ వచ్చే అవకాశాలు చాలా స్వల్పంగా ఉంటాయన్నారు. ఈ క్రమంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో దీర్ఘకాలం పాటు యాంటీ బాడీలు ఉంటాయని, వారికి కోవిడ్ నుంచి చాలా కాలం పాటు రక్షణ లభిస్తుందన్నారు. కనుక కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్లు వేయడం వృథా అని, వారికి తప్ప మిగిలిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని సైంటిస్టులు సూచించారు.
ఇక చికెన్ పాక్స్, ఇన్‌ఫ్లుయెంజాలకు వ్యాక్సిన్ తీసుకుంటే శరీరంలో చాలా సంవత్సరాల పాటు యాంటీ బాడీలు సహజంగానే ఉత్పత్తి అవుతాయని, అందువల్ల ఆయా వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని, కనుక కోవిడ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుందని తెలిపారు. కాబట్టి కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ ఇవ్వాల్సిన పనిలేదని, అందరికీ ఇచ్చాక అప్పుడు వారికి ఇవ్వవచ్చని, ఎలాగూ వారికి రక్షణ ఉంటుంది కనుక ఆలస్యం అయినా ఏమీ కాదని సైంటిస్టులు తెలిపారు. అయితే కోవిడ్ నుంచి కోలుకున్నా, కోవిడ్ సోకకున్నా ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరి సైంటిస్టుల మాటలను ప్రభుత్వాలు ఆలకిస్తాయో, లేదో చూడాలి.