సూర్యాపేట జిల్లా : తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇరు రాష్ర్టాల మధ్య నీటి పంచాయితీకి కారణం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని జగన్ సర్కార్ ఆకతాయి పిల్లాడిలా వ్యవహరించి, కేంద్ర బలగాలను కోరడం వారి చేతగాని తనానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం ముందుగా జీవో 203 ను ఉపసహరించుకోవాలని… డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి.
పొరుగు రాష్ట్రం స్నేహ హస్తం ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోలేని ఆంధ్ర ప్రభుత్వం అటు కేంద్రానికి ఇటు సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని చురకలు అంటించారు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టు లు అన్ని సక్రమంగా ఉన్నాయని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆంధ్ర ప్రభుత్వం సుప్రీకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదని… నీటి వాటా తేల్చాలని మేం కూడా సుప్రీం కోర్టును అడుగుతున్నామని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి.