ఆ ముగ్గురు ఎంపీల‌పై జ‌గ‌న్ నిఘా…!

-

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న పార్టీకే చెందిన ముగ్గురు ఎంపీల‌పై నిఘా పెట్టారా ? అంటే ప్ర‌స్తుతం వైసీపీ వ‌ర్గాల్లో ఇదే విష‌యం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో అధికార వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. 2014 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న ఆయన ఎన్నికలకు ముందు జగన్ తో విభేదించి బయటకు వచ్చేశారు. జగన్ పై ఎవరూ చేయని విధంగా తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్‌కు పెద్దలంటే ఏమాత్రం గౌరవం లేదని తనను కూడా తీవ్రంగా అవమానించారంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత బిజెపిలోకి వెళ్ళిన ఆయన ఆ త‌ర్వాత టీడీపీలోకి జంప్ చేశారు.

మళ్లీ తిరిగి 2019 ఎన్నికలకు ముందు జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అలా, ఐదేళ్ల గ్యాప్ తర్వాత వైసీపీలో చేరి, నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకుని గెలిచారు. అలా ఎంపీ కావాల‌నుకున్న త‌న చిర‌కాల కోరిక ఎట్ట‌కేల‌కు వైసీపీతో నెర‌వేర్చుకున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచిన రెండు నెలల నుంచే రఘురామకృష్ణరాజు వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. సాధారణంగా వైసీపీ నేత ఎవ‌రు అయినా గాని జ‌గ‌న్ గీసిన గీత దాట‌కుండానే ఉండాల్సి ఉంటుంది. జగన్ మాట జ‌వ‌దాట‌డం అంటే కొరివితో తలగోక్కున్న‌ట్టే.. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం తనకు నచ్చిందే చేస్తారు… మనసుకు అనిపించింది నిర్మొహమాటంగా చెపుతారు.

అదే ఇప్పుడు ఆయనకు పార్టీ పరంగా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇంగ్లీష్ మీడియం విష‌యంలో పార్టీ లైన్‌ను క్రాస్ చేసి తెలుగుకు మద్దతుగా మాట్లాడిన ఆయన అధినేత జగన్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే జగన్ ఢిల్లీ నుంచి ర‌ఘురామ‌ను ఆగమేఘాలమీద అమరావతి పిలిపించుకుని మ‌రీ వివ‌ర‌ణ తీసుకున్నాన‌రు. ఇది అయిన రెండు రోజుల‌కే ఇప్పుడు ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒకపక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే ఆయన బిజెపి పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ దాదాపుగా గంటకు పైగానే చర్చలు జరిపారు. ఈ విషయం ఫోటోలతో సహా బయటకు వచ్చేసింది.

జగన్ ఈ క్రమంలోనే రఘురామకృష్ణంరాజుపై పార్టీ వర్గాల ద్వారా నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు దక్షిణ కోస్తాలో ఇద్దరు సీనియర్ ఎంపీలపై కూడా వైసిపి వర్గాలు నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రు ఎంపీల‌కు జాతీయ స్థాయిలో కోట్లాది రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు ఎంపీలు కూడా బిజెపి పెద్దలతో తరచూ టచ్ లోకి వెళ్తున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు ఎవరైనా బిజెపి లేదా ఇతర పార్టీల నేతలతో సమావేశం అవ్వాలంటే కచ్చితంగా విజయసాయిరెడ్డి లేదా మిథున్‌రెడ్డికి చెప్పి.. వాళ్ల‌ అనుమతి తీసుకొని మాత్రమే వెళ్లాలని జగన్ ఇప్పటికే తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రఘురామకృష్ణంరాజుతో పాటు ఆ ఇద్దరు ఎంపీలు జగన్ ఆదేశాలను లైట్ తీసుకున్నట్టే పార్టీ వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి వ్యవహారశైలిపై అనుమానం ఉన్న పార్టీ అధినేత ఢిల్లీ స్థాయిలో వీరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version