ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన మీద కోడి కత్తితో ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చుట్టూ అనేక రాజకీయ ఆరోపణలు వచ్చినప్పటికీ ఎందుకో కానీ కేసు నీరుగారిపోయింది అని చెప్పవచ్చు. కానీ తాజాగా ఆ రెస్టారెంట్ ఓనర్ కి జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. విశాఖలోని సిరిపురం విశాఖపట్నం మున్సిపల్ రీజినల్ డెవలప్మెంట్ అధారిటీ స్థలంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్‌ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఫ్యూజన్ ఫుడ్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు.
ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తమను ఖాళీ చేయిస్తున్నారు అని ఫ్యూజన్ ఫుడ్స్ సంస్థ యజమాని హర్ష ఆరోపిస్తున్నారు. 2024 వరకు లీజు ఉన్నప్పటికీ ఖాళీ చేయించడం మీద యజమాని మండిపడుతున్నారు. అయితే, లీజు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని అందుకే ఈ ఫ్యూజన్ ఫుడ్స్ వల్ల రెవెన్యూకు నష్టం వాటిల్లుతుండటంతో ఖాళీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని టీడీపీకి చెందిన నేత కావడంతో ప్రభుత్వం చేస్తోంది అనే విమర్శలు వినబడుతున్నాయి.