సంక్షేమ పథకాల అమలుతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ నేడు ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మిర్చి, పసుపు వంటి పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల ప్రకారమే రైతుల నుంచి పంటల కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
మిర్చి, పసుపు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేవని, అయినా రైతుల కోసం మద్దతు ధరను ప్రకటిస్తున్నట్లు ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వ నిధులను తీసైనా రైతులకు మద్దతు ధర ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మిర్చి క్వింటాలుకు రూ.7వేలు, పసుపు రూ.6350, ఉల్లి రూ.770, అరికెలు, కొర్రలు, వూదలు, వరిగ, సామలు వంటి చిరుధాన్యాలు క్వింటాలుకు రూ.2500 కనీస మద్దతు ధర ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది