అమరావతి : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్రానికి డిప్యూటేషన్ పై పంపించే ఐఏఎస్ అధికారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన కేంద్రం.. రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది కేంద్ర డీఓపీటీ.
రాష్ట్రాల నుంచి కేంద్రానికి డిప్యుటేషన్ పై పంపించే ఐఏఎస్ అధికారుల అంశంలో సవరణలు తీసుకుని వస్తున్న కేంద్ర చొరవను ఈ సందర్భంగా అభినందించారు సీఎం జగన్. అయితే రాష్ట్రాలు నిర్భ్యంతర పత్రాలు విడుదల చేసిన తర్వాతే డిప్యూటేషన్ ఖరారవుతున్న ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని లేఖలో సీఎం పేర్కొన్నారు.
డిప్యూటేషన్ పై వచ్చే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడువును నిర్ణయించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ తీసుకుని వస్తున్న తాజా సవరణ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఉన్నపళంగా కీలక బాధ్యతల్లో ఉండే అధికారులు వెళ్ళిపోతే పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో తెలిపారు.