ఏపీ విద్యార్థులకు అలర్ట్. జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల జమ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 18న NTR(D) తిరువూరులో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. తొలుత ఈ నెల 7వ తేదీన పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా వేశారు.
ఇప్పటికే సీఎం సభ కోసం నాలుగు వేదికలను గుర్తించగా, ఈనెల 14న ఖరారు చేయనున్నారు. ఇక అటు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్ లో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో అప్లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వెంటనే విద్యార్థులకు వాటిని అందించాలని కాలేజీలకు సూచించింది. సందేహాలు ఉంటే 18004257635 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని పేర్కొంది. పరీక్షలకు 10.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, 1,489 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది.