వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని తెలిపింది. ఏపీలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రులు కోడలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లను అధిష్టానం తప్పించింది. సజ్జల, బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతను వైయస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అప్పగించింది. అలాగే ఇప్పటివరకు అనిల్ కుమార్ చూసుకున్న వైయస్సార్, తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి అప్పగించింది. బాలినేని విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చిన అధిష్టానం, ఆయన ఇప్పటివరకు చూస్తున్న మూడు జిల్లాల్లో నెల్లూరును కొనసాగించింది.