యూనివర్సిటీల్లో జగన్ ఫ్లెక్సీలు..పవన్ అదిరిపోయే లాజిక్‌లు..!

-

కరెక్ట్‌గా నాలుగు నెలల క్రితం..ఆగష్టు నెలలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని, ఇది మానవాళికి కూడా ముప్పు అని చెప్పి..ఫ్లెక్సీలని బ్యాన్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరెక్ట్ గా పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకు ఒక వారం ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. పవన్ పుట్టిన రోజు నాడు ఫ్లెక్సీలు కట్టకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని, జనసేన శ్రేణులు ఫైర్ అయ్యాయి.

అయితే ఏదేమైనా పర్యావరణానికి నష్టం కలిగించే ఫ్లెక్షీలని బ్యాన్ చేయడం అంతా స్వాగతించారు. మరి ఫ్లెక్సీలపై బ్యాన్ కొనసాగుతుందా? అంటే మాటల్లోనే బ్యాన్ తప్ప..చేతల్లో బ్యాన్ లేదు. దానికి ఉదాహరణ..తాజాగా జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఫ్లెక్సీలు కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జగన్ ఫ్లెక్సీలతో నింపేశారు. ఆఖరికి యూనివర్సిటీల్లో సైతం ఈ ఫ్లెక్సీలు కనిపించాయి.

ఇదే క్రమంలో ఈ అంశంపై పవన్ తీవ్రంగా స్పందించారు.  ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందని సందేశం ఇచ్చిన సీఎం జగన్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందని, యూనివర్శిటీల నుంచి ఎందరో మేధావులు వచ్చారని, అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేస్తూ, పార్టీ ఫ్లెక్సీలు కట్టించేవాళ్ళు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆలోచించాలని సూచించారు.

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ ఇదే పరిస్తితి ఉందని, జగన్‌పై అనురాగం ఉంటే వాటిని ఇంటికే పరిమితం చేసుకోవాలని సూచించారు. విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని హెచ్చరించారు. పవన్ చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో జగన్ ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే పర్యావరణానికి నష్టమని చెప్పిన వారే ఫ్లెక్సీలు కడుతున్నారు. మరి ఇదేం రాజకీయమో వైసీపీ వాళ్ళకే తెలియాలని జనసేన శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version