సోము వీర్రాజు పై జనసేన విమర్శలు ఎక్కుపెట్టింది అందుకేనా

-

గల్లీ కాదు… ఢిల్లీలో తేల్చుకుంటామని ఏపీ బీజేపీకి కరెంట్‌ షాక్‌ కొట్టేలా జనసేన నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు పార్టీలలోనూ చర్చకు దారితీస్తున్నాయి. సోము వీర్రాజు లక్ష్యంగా జనసేన నేతలు చేస్తోన్న విమర్శల వెనక బలమైన కారణాలే ఉన్నాయన్నది పొలిటికల్ గా ఇన్ సైడ్ టాక్ నడుస్తుంది. ఉప ఎన్నిక వేళ వైరిపక్షాలను వదిలి మిత్రపక్షాలే కత్తులు దూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..సోము వీర్రాజు పై మిత్రపక్షం జనసేన విమర్శల దాడి ఎందుకు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది….

ఇటీవల తిరుపతిలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. భారీ శోభాయాత్రకు కమలనాథులు నిర్ణయం తీసుకున్న సమయంలో జనసేన వారిని కూడా పిలుద్దామనే ప్రస్తావన వచ్చిందట. ఆ సమయంలో జనసేన అవసరమే లేదని సొంతంగానే ర్యాలీకి వెళ్దామని చెప్పారట బీజేపీ నేతలు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జనసేన నాయకులు తీవ్రంగా రగిలిపోతున్నారట. జనసేన మిత్ర పక్షమంటూనే వీర్రాజు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని.. తిరుపతి సభలో ఆయన మాట్లాడిన మాటలను పవన్‌ కల్యాణ్ చెవిలో వేశారట జనసైనికులు.

తమను సంప్రదించకుండా ఏకపక్షంగా తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని ఎలా ప్రకటిస్తారని జనసైనికులు ఓపెన్‌గానే కౌంటర్‌ ఇస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని దెప్పి పొడుస్తున్నారు కూడా. అంతేకాదు.. ఉమ్మడి అభ్యర్థిని డిసైడ్‌ చేసేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అయితే మధ్యలో సోము వీర్రాజుకు ఏం పని.. అని ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు మిత్రపక్షంలో మిత్రబేధాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

తిరుపతిలో బలమైన సామాజికవర్గం జనసేనకు మద్దతిచ్చే అవకాశం ఉందని పవన్‌ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారట. 2009లో ప్రజారాజ్యం తరఫున ఆ పార్టీ చీఫ్‌ చిరంజీవి తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు కూడా. అందుకే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో దించితే కేడర్‌కు మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారట జనసేనాని. అందుకే పది మందితో యాక్షన్‌ కమిటీ వేశారని అనుకుంటున్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగానే ఏపీ బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్నారట జనసేన నాయకులు.

సోము వీర్రాజు తీరుపై కొందరు బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. జనసేనతో విభేదాలు పొడచూపిన సమయంలోనే ఈ ప్రచారం బయటకు రావడం ఉత్కంఠ రేపుతోందట. దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు పార్టీలో మంచి మైలేజ్‌ తీసుకొస్తే.. తిరుపతి ఉపఎన్నిక మాత్రం షెడ్యూల్‌ రాకుండానే వీర్రాజుకు సెగలా తగులుతుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడి పరిణామాలను ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా తీసుకుంటే ఏమౌతుందనే చర్చ మొదలైందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version