ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన వైఖరి చాలా ఆసక్తికరంగా మారింది. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీకి పూర్వవైభవం రావాలంటే జనసేన నుంచి జవసత్వాలు కావాలని తమ్ముళ్లు నేరుగా మైకులముందు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ మేరకు డిమాండ్స్ కూడా చేస్తున్నారు. ఆ సంగతి అటుంచితే… ఇందుకు జనసేన ఒప్పుకుంటుందా? పొత్తు పెట్టుకుంటుందా?
ఏపీలో టీడీపీకి పూర్వవైభవం రావాలంటే… జనసేన మద్దతు చాలా అవసరం అనేది టీడీపీ నేతలు చెబుతున్న మాట. పరిషత్ ఎన్నికలఫలితాల అనంతరం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వారి కలయిక కాస్త సక్సెస్ అయ్యింది! దీంతో… వీరి కలయికపై మీడియాలో కథనాలు మొదలైపోయాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో జనసేనకు సంబందించిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. జనసేనతో పొత్తు వద్దని భావిస్తున్న తమ్ముళ్లు కొందరు.. ఈ మేరకు దాన్ని వైరల్ చేసేపనికి పూనుకున్నారు!
అవును… “టీడీపీతో పొత్తు అనేది ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధితో సమానం. దానికి ఖిమోథెరపీ చెయ్యాలి. టీడీపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తుండదు. తరువాత రాబోయే ఎన్నికల్లో జనసేన – బీజేపీ మాత్రమే కలిసి పోటీచేస్తాయి” అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి… బొలిశెట్టి సత్యన్నారాయణ పేరున ఒక పోస్ట్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది.
అయితే… టీడీపీతో పొత్తు వద్దు అని భావిస్తోన్న జనసైనికులే ఈ పోస్టు ను వైరల్ చేసేపనికి పూనుకున్నారా.. లేక, జనసేనతో కలిసి వెళ్లొద్దని భావిస్తున్న టీడీపీ కార్యకర్తలు ఈ పనికి పూనుకున్నారా అన్నది తెలియదు కానీ… బాబు ఆశలపై ఈ పోస్ట్ నీళ్లు చల్లుతుందని మాత్రం చెబుతున్నారు విశ్లేషకులు!
మరి రాజకీయాల్లో శాస్వత శత్రువులూ శాస్వత మిత్రులూ ఉండరు కాబట్టి… చంద్రబాబుతో పవన్ కలుస్తారా – కలిసి ప్రయాణిస్తారా – లేక ఒంటరిగానే రంగంలోకి దిగుతారా అన్నది వేచి చూడాలి!