అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల హెచ్చరికలను ఖాతరు చేయని ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం నిర్వహించిన ప్రయోగంతో జపాన్ ఒక్కసారిగా వణికిపోయింది. ఆ క్షిపణి తమ దేశంలో ఉత్తర దిశగా ఉన్న హొక్కైడో ద్వీపం సమీపంలో పడుతుందని భయపడింది.
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించిన వెంటనే జపాన్ ప్రభుత్వం తమ ప్రజలను హెచ్చరించింది. ‘వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి.. సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండి’ అంటూ ఆ ద్వీపంలోని ప్రజలను కోరింది. తర్వాత కొద్దిసేపటికే ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ద్వీపానికి సమీపంలో ఉత్తర కొరియా క్షిపణి కూలుతుందని పొరబాటున అంచనా వేసినట్లు పేర్కొంది.
కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో అమెరికా, దక్షిణ కొరియా వరుసగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సైనిక ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. ఈ విన్యాసాలకు ప్రతిగా ఇప్పటి వరకూ ఉత్తరకొరియా 30 క్షిపణులను ప్రయోగించింది.