చదువు పూర్తవగానే అందరూ ఎదురుచూసేది ఉద్యోగం కోసమే. ఎప్పుడెప్పుడు జాబ్ వస్తుందా మొదటి సాలరీతో స్నేహితులకి పార్టీ ఇచ్చి సెటిల్ అయ్యాయనని చెప్పుకుందామా అని చూస్తుంటారు. చదువు పూర్తి చేసుకున్నవాళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగం వైపే చూస్తారు తప్ప వ్యాపారం ప్రారంభించాలని అనుకోరు. ఒకవేళ ప్రారంభించాలనుకున్నా, కొన్ని రోజులు ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించి ఆ తర్వాత మొదలెడదాం అనుకుంటారు. కానీ అప్పటికే పెళ్ళయిపోతుంది. దాంతో ఈ టైమ్ లో రిస్క్ ఏం తీసుకుంటాంలే, జాబ్ బాగానే ఉందికదా అని చెప్పి వారి వ్యాపార కలలకి తెర వేసేస్తారు.
ఉద్యోగం, వ్యాపారం.. రెండిట్లో ఏది ఉత్తమం. రెండింటికీ ఉన్న తేడా అందరికీ తెలుసు. ఉద్యోగంలో ఒకరి కింద పనిచేయాలి. వ్యాపారంలో నీకు నువ్వే బాస్ ఉంటావ్. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని చెబుతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఉద్యోగంలో ఒక పని చేస్తున్నప్పుడూ నీ పైన మేనేజర్ ఉంటారు. ఆపైన మరో మేనేజర్, ఇలా ఒక్కొక్కరు ఉంటూ ఉంటారు. అదే వ్యాపారానికి వచ్చేసరికి నీపైన కస్టమర్ ఉంటాడు. కస్టమర్ కి కావాల్సినట్టుగా నువ్వు పనిచేయాల్సి ఉంటుంది. నువ్వు వ్యాపారం పెట్టుకున్నావు కదా అని చెప్పి, నీ దగ్గరకి కస్టమర్ వస్తాడనుకంటే పొరపాటే.
కస్టమర్ కి ఎక్కువ ఛాయిస్ ఉంది. అలాంటప్పుడు నువ్వు కస్టమర్ చెప్పినట్టు వినాల్సిందే. లేదు కస్టమర్ కి నచ్చని వాటిని తీసుకొచ్చి బిజినెస్ చేస్తా అంటే మూసేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో మేనేజర్ కి నచ్చినట్టు ఎలా చేస్తారో, బిజినెస్ లో కస్టమర్ కి నచ్చేలా చేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా మార్కెటింగ్, బ్రాండింగ్, సేవలు చాలా ముఖ్యం. నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నదని చాలా అందంగా చెప్పాల్సి ఉంటుంది. ఇవేమీ చేయకుండా బిజినెస్ లో నెగ్గుకు రాలేరు. వ్యాపారంలో నష్టానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, నష్టం వచ్చినా తట్టుకునేలా ఉండాలి. లేదంటే మళ్లీ నిలబడడం కష్టం అవుతుంది.
అదే ఉద్యోగంలో అలా కాదు. నెల నెలా జీతం వస్తుంది. ఒకవేళ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం దొరికే ఛాన్స్ ఎక్కువ. అదే బిజినెస్ లో అలా కాదు. మరో బిజినెస్ మొదలెట్టాలంటే పెట్టుబడి కావాలి. దీన్నిబట్టి ఎందులో ఉండాల్సిన ఇబ్బందులు అందులో ఉంటాయి. దూరపు కొండలు నునుపు అన్నట్టు జాబ్ చేస్తున్నవారికి వ్యాపారం బాగుంటుందనిపిస్తుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి ఈ గోలంతా ఏంట్రా బాబు అనిపిస్తుంది.