ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎయిర్ ఇండియా ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏకంగా 5100 మందిని నూతనంగా విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. దేశంలోని అనేక నగరాలతో పాటు అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారందరికీ ఈ రిక్రూట్మెంట్లో అవకాశం కల్పిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎంపికైన వారిలో సేవా నైపుణ్యాలను పెంపొందించేందుకు 15 వారాల ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది. ఈ శిక్షణను పొందే అభ్యర్థుల కోసం ముంబయిలో ప్రత్యేకంగా తరగతి గదులతో పాటు పలు ఫ్లైట్లలో ట్రైనింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది.
“కొత్తగా తీసుకునే ప్రతిభావంతుల ద్వారా ఎయిర్ ఇండియా సేవలు మరింత వేగం పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. వీటితో పాటు భవిష్యత్తులో మరి కొంతమంది పైలట్లు సహా ఇంజనీర్లను కూడా నియమించుకునే యోచనలో ఉన్నాం.” అని ఎయిర్ ఇండియా సర్వీసెస్ అధినేత సందీప్ వర్మ చెప్పారు.