మునుగోడులో ఆసక్తికర ఘటన.. రాజగోపాల్‌ రెడ్డి మద్దతు కోరిన కేఏ పాల్‌.. ఇంకా..

-

మునుగోడులో ప్రచారం జోరుగా సాగుతోంది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ఆయా పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. తాజాగా మునుగోడులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక బరిలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ తరపున ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో, ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన నామినేషన్ తో కేఏ పాల్ ఎన్నిక బరిలో నిలిచారు. ప్రచారపర్వంలో ఆయన దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా నిన్న ఆయన చండూరుకు వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డిని చూసిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన కేఏ పాల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డికి కేఏ పాల్ ఆసక్తికర విన్నపం చేశారు. ఉప ఎన్నికలో తనకు మద్దతును ఇవ్వాలని కోరారు.

తనను గెలిపిస్తే 60 నెలల్లో ఎవరూ చేయలేనంత అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పారు. మునుగోడును మరో అమెరికా చేస్తానని తెలిపారు. మరోవైపు కేఏ పాల్ ను చూసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. కేఏ పాల్ కూడా బీజేపీ శ్రేణులతో కలిసి కాసేపు నడిచారు. ఈ సందర్భంగా మీడియాతో కేఏ పాల్ మాట్లాడుతూ… తనకు మద్దతును ఇవ్వాలని తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని కోరానని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్లను కొనుక్కుంటున్నాయని కేఏ పాల్ ఆరోపించారు. ఒకప్పుడు అడవిగా ఉన్న హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పారు. తనను గెలిపిస్తే మునుగోడును మరో అమెరికా చేస్తానని అన్నారు. ఆరు నెలల్లో 7 వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తానని చెప్పారు కేఏ పాల్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version