గత ఆరు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. తెలంగాణతో పాటు ఎగువన ఉన్న రాష్ట్రాల్లో సైతం వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో.. ఎగువన భారీవర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరిందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు.
అయితే అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. కాగా, ప్రాజెక్టు మొత్తం 18 గేట్లకు గాను ఒకటి మొరాయించింది. దీంతో 17 గేట్లను పూర్తిగా తెరచివేశారు. అయితే వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అయితే రాత్రాంతా అధికారులు ప్రాజెక్ట్ వద్దే ఉంటే పరిస్థితిని సమీక్షించారు. అంతేకాకుండా మొరాయించిన 18వ గేటును సైతం తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.