బీజేపీ పార్టీపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించడంతో.. భయపడి సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నారని… మోదీది రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఆదానీ, అంబానీల ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. ఏడేళ్ల కాలంలో భారతదేశ జీడీపీ తగ్గితే… తెలంగాణ జీఎస్టీపీ పెరిగిందని… భారతదేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని వెల్లడించారు.
రైతుల విషయంలో అన్నీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుని రైతులకు శఠగోపం పడుతోందని… బడా పారిశ్రామిక వేత్తలకు 10లక్షల 60వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన కేంద్రం రైతుల విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం సత్ఫలితాలు ఇచ్చిందని… ఉద్యోగాల కల్పన లేకపోగా… ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారని ఆగ్రహించారు.
ఒక వైపు ఆహారపు కొరత ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే మీరు ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని… బీజేపీ నేతలకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రైతులు ఎక్కడున్నా… రైతులే ఢిల్లీ రైతులతో పాటు తెలంగాణ రైతులనూ ఆదుకుంటామని… కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ కి ఏమి ఇచ్చింది ..బీజేపీ నేతలు ఏమి తెచ్చారని మండిపడ్డారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని ఆగ్రహించారు.