ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్‌ఎఫ్) ఎన్నికల్లో ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ కళ్యాణ్ చౌబే ఘనవిజయం సాధించారు. 85 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి ఆటగాడిగా చౌబే రికార్డు సృష్టించాడు. ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో దిగ్గజ ఆటగాడు బైచుంగ్ భుటియాకు చుక్కెదురైంది.
చౌబేకు ముందు రాజకీయ నాయకులు ప్రియరంజన్ దాస్‌మున్షీ, ప్రఫుల్ పటేల్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఎన్నికల్లో 34 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా.. చౌబే 33-1తో భుటియాపై గెలుపొందాడు. రాష్ట్ర సంఘాలకు ఓటు హక్కు కల్పించగా.. భుటియాకు వారి నుంచి మద్దతు లభించలేదు.
గత ఎన్నికల్లో బంగాల్‌లోని కృష్ణానగర్ పార్లమెంటు స్థానం నుంచి చౌబే బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. భారత్ తరఫున చౌబే ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా కొన్నిసార్లు జట్టుకు ఎంపికయ్యాడు. వయో పరిమితి విభాగాల్లో అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ఆడాడు. ప్రముఖ క్లబ్‌లు మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్‌లకు గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. ఓ సమయంలో భుటియా, చౌబేలు ఈస్ట్ బెంగాల్‌కు కలిసి ఆడారు.