బిజెపి ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, ఆ ప్రభుత్వం మనుగడ సాధించడం అన్ని విధాలుగా కష్టమే. కర్ణాటకలో పచ్చగా ఉన్న కాంగ్రెస్, జెడిఎస్ కూటమి కాపురాన్ని కూల్చే వరకు బిజెపి నిద్రపోలేదు. జెడిఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేసింది, ఆఫర్ ని నమ్మి బయటకు వచ్చారు. ఉప ఎన్నికలకు వెళ్ళారు. విజయం సాధించారు. ఈ లోపు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది బిజెపి.
ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కమల్ నాథ్ సర్కార్ కూడా అతుకుల బొంత, తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది ప్రభుత్వం. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది, కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ని తమలో కలుపుకుంది, రాజ్యసభ ఎంపీ సీటు తో పాటుగా కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసింది. కాదనలేని సింధియా బయటకు వచ్చారు.
బిజెపి కండువా కప్పేసారు బిజెపి నేతలు. ఇప్పుడు బలపరీక్ష నిర్వహించాలను 22 మంది ఎమ్మెల్యేలను తమ క్యాంప్ లో ఉంచుకుని గవర్నర్ తో ఆదేశాలు ఇప్పించింది. 106 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ ఎదుట పరేడ్ చేయించింది బీజేపీ. “ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఆరుగురు మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వెంటనే విచారణ జరపాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన 12 గంటల లోపు పరీక్ష జరిగేలా చూడండి”
అని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు. బిజెపి అనుకూలంగా గవర్నర్ జోక్యం చేసుకుని, ఇవాళ బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. దీనిపై ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చెరలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బయటకు వస్తేనే తాము బలపరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. దీనితో బలపరీక్ష నిర్వహిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.