ల‌లితా త్రిపురసుంద‌రిగా ద‌ర్శ‌న‌మిచ్చిన అమ్మ‌వారు

-

విజ‌య‌వాడ‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. లలితాత్రిపుర సుందరిదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అటు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈరోజు భ్రమరాంబ అమ్మవారు… కుష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈవో వ‌ర్సెస్ పాల‌క‌మండ‌లి
కనకదుర్గ ఆలయ ఈవో కోటేశ్వరమ్మకు, పాలక మండలి సభ్యులకు మధ్య వివాదం తలెత్తింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అడ్డదారుల్లో అమ్మవారి దర్శనాలకు వెళ్లేవారిని నియంత్రించే క్రమంలో కొన్ని చోట్ల గేట్లకు తాళాలు వేశారు. దీనిపై పాలకమండలి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారి దర్శనానికి రాగా ఈవో తీరును ఓ పాలకమండలి సభ్యుడు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గేట్లకు తాళాలు వేయటంతో తాము రాకపోకలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈవో తమను ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ పాలకమండలి సభ్యుడు శంకరబాబు మంత్రికి ఫిర్యాదు చేశారు.

తనపై మంత్రికి ఫిర్యాదు చేయటంతో ఈవో అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత గల బోర్డు సభ్యులై ఉండి ఇలా ప్రవర్తించటం ఎంతమేరకు సబబని ప్రశ్నించారు. దుర్గగుడి రాజగోపురం ముందే ఈవో, పాలకమండలి సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటంతో అక్కడే ఉన్న మంత్రి అవాక్కయ్యారు. పాలకమండలి ఛైర్మన్‌, సభ్యులు, ఈవోతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు ఈ ఉత్సవాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారని ఎలాంటి వివాదాలకు అవకాశమివ్వకుండా అంతా ముందుండి నడిపించాలని నచ్చజెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version