సినిమా బాగుంది అన్న టాక్ వస్తే చాలు.. బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిపోతుంది. ఓ సినిమా 100 రోజులు ఆడింది అంటే అది ప్రేక్షకుల దృష్టిలో పెద్ద హిట్! మరి అదే సినిమా థియేటర్లలో 100 రోజులకు మించి ఆడితే ఇంక ఆ సినిమాకు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో, ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే అలాంటి సినిమాలను రీరిలీజ్ చేస్తుంటారు. సాధారణంగా రీరిలీజ్ కూడా ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు. కానీ ఓ సినిమాకు 550పైగా రీరిలీజ్‌లు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ నిజం.
ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర దర్శకత్వంలో శాండిల్‌వుడ్ స్టార్ నటుడు శివరాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన ‘ఓం’ చిత్రం సృష్టించిన రికార్డులే ఇవన్నీ. 1995లో విడుదలైన ఈ చిత్రానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆదివారం (సెప్టెంబరు 18) ఉపేంద్ర జన్మదినం సందర్భంగా అవేంటో చూసేద్దాం..
ఒక లెటర్‌తో స్టోరీ..ఏవరో రాసిన ఓ లేఖ నుంచి ఈ సినిమా కథ పుట్టింది అంటే నమ్మగలరా? కానీ ‘ఓం’ సినిమా విషయంలో అదే జరిగింది. 80వ దశకం చివరిలో ఈ కథ రూపుదిద్దుకుంది. కాలేజీ రోజుల్లో ఉపేంద్ర స్నేహితుడు పురుషోత్తం.. అతని దృష్టిని ఆకర్షించిన ఓ లేఖను ఉపేంద్రకు చూపించాడు. ఆ లేఖ నుంచి పొందిన స్ఫూర్తితో.. దర్శకుడు తన కథలోని మొదటి భాగాన్ని సిద్ధం చేశారు.
నిజ జీవిత కథ.. ఈ సినిమా నేపథ్యాన్ని ఉపేంద్ర సోదరుడి స్నేహితుడైన సత్య అనే వ్యక్తి జీవితం ఆధారంగా తీర్చిదిద్దారు. ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఈ కథ నేపథ్యం.
సినిమా కోసం బెయిల్… ఈ చిత్రంలో నిజ జీవితంలో అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తులు నటించారు. ఇందుకోసం కొందరు నేరస్థులకు బెయిల్ ఇప్పించాల్సి వచ్చింది. జేదరహల్లి కృష్ణప్ప, బెక్కిన కన్ను రాజేంద్ర, కోరంగు, తన్వీర్ వంటి పేరు మోసిన రౌడీలు ఇందులో నటించారు.
దేశమంతటా చర్చే..!ఈ సినిమా విడుదలకాక ముందు నుంచే దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడిచింది. ఇటువంటి సినిమాను దిగ్గజ నటుడు రాజ్‌కుమార్ బ్యానర్లో నిర్మించి ఉండాల్సింది కాదంటూ ఓ మ్యాగజైన్ ఏకంగా కవర్ స్టోరీనే ప్రచురించింది.
భారీ బడ్జెట్..డాక్టర్. రాజ్‌కుమార్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్ రూ.70 లక్షలు. అప్పటికి ఇంత మొత్తంలో సినిమా తీయడం రాజ్‌కుమార్ బ్యానర్‌కు అదే తొలిసారి. విడుదలకు ముందే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌లో భాగంగా రూ.2 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత.. ‘ఓం’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ప్రతి ఏడాది రీరిలీజే..1995లో విడుదలైన ఈ చిత్రానికి కన్నడ సీమలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే.. అభిమానుల కోసం ప్రతి ఏడాది థియేటర్లలో రీరిలీజ్ చేస్తూ వచ్చింది చిత్ర బృందం. రిరిలీజ్లలో భాగంగా 75 సార్లు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.1995-2017 వరకు 550పైగా రీరిలీజ్‌లు ఉన్న ఈ చిత్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
20 ఏళ్ల తర్వాత కూడా..శాండిల్‌వుడ్‌లో అప్పటివరకు ఉన్న ఓపెనింగ్ రికార్డులను ‘ఓం’ బద్దలుకొట్టింది. రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి కన్నడ సినిమాలో అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.20 ఏళ్ల తర్వాత కూడా.. 2015లో ఈ చిత్రం టీవీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. రూ. 10 కోట్ల రూపాయలకు టీవీ హక్కులను సంబంధిత సంస్థ దక్కించుకుంది.
ఇన్ని రికార్డులు ఉన్న ఈ ‘ఓం’ చిత్రం కన్నడ సినీ పరిశ్రమ చరిత్రలో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది.