చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. 2020 నుంచి వరుస విషాదాలు చిత్ర పరిశ్రమ ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటి కే చాలా మంది ప్రముఖ నటులను కోల్పోయిన చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా కన్నడ పవర్ స్టార్, యంగ్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి చెందారు. గుండె పోటు కారణంగా పవన్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి చెందారు.
ఇవాళ ఉదయం జిమ్ చేస్తుండగా… పునీత్ రాజ్ కుమార్ కు గుండె పోటు వచ్చినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటా హుటీన బెంగుళూరు లోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే… పరిస్థితి తీవ్ర తరం కావడంతో.. ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే… అధికారికంగా ప్రకటించారు. వైద్యుల ప్రకటన తో… ఆయన కుటుంబంతో పాటు ఆయన ఫ్యాన్స్ విషాదంలోకి వెళ్లారు. ఇక ఆయన మృతి పై పలుగురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
పునీత్ రాజ్ కుమార్ కెరీర్
కన్నడ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ ను.. ఆయన అభిమానులు అప్పు అని ప్రేమగా పిలుచుకుంటారు. పునీత్ లెజండరీ యాక్టర్ కంఠీరవ రాజ్ కుమార్… పార్వతమ్మ లకు చెన్నై లో జన్మించారు. రాజ్ కుమార్ కు పుట్టిన ఐదుగురు పిల్లలలో పునీత్ అందరికన్నా చిన్నవాడు. ఆయన సోదరుడు శివ రాజ్ కుమార్ ప్రముఖ నటుడు. పునీత్ కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు అతని కుటుంబం మైసూరు కు వెళ్లి.. అక్కడే స్థిరపడింది. పునీత్ చిక్కమగళూరు కు చెందిన అశ్విని రేవంత్ ను… 1999 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. పునీత్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సినిమా కెరీర్ విషయానికి వస్తే… పునీత్ రాజ్ కుమార్ దాదాపు 29 కి పైగా కన్నడ సినిమాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన పునీత్ రాజ్ కుమార్… 1985 లోనే.. బెట్టడ హువు లో తన నటనకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ చలన చిత్ర అవార్డులు గెలుచుకున్నాడు పునీత్. ఇక 2002 లో వచ్చిన అప్పు ఈ సినిమాతో పునీత్ హీరోగా అందరికీ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి హీరోగా ఎదిగాడు పునీత్. పునీత్ చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన యువరత్న సినిమాలో కనిపించాడు.