కక్షలు, కార్పణ్యాలకు ఒకప్పుడు వేదిక. ప్రత్యర్థులు స్కెచ్ గీస్తే.. సాధించే వరకు నిద్రపోని గడ్డ అది! – ఈ పరిణామాలే.. రాష్ట్రంలోనే కాకుండా పల్నాడుకు దేశవ్యాప్తంగా చర్చ తెచ్చాయి. అలాంటి గడ్డ మీద గెలిచే నాయకులు కూడా అదే తరహాతో రాజకీయాలు చాలా ఏళ్ల పాటు చేశారని ఇక్కడి ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకొంటారు. నాయకుల పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాల మధ్య కొన్ని దశాబ్దాల పాటు నలిగిపోయిన పల్నాడు ప్రాంతం అదే తరహాలో అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిపోయిందనేది వాస్తవం. ఇప్పటికీ.. నగరానికి అత్యత చేరువలో ఉండే గ్రామాలకు, ప్రాంతాలకుకూడా రహదారి సౌకర్యం లేక పోవడం గమనార్హం. అదేవిధంగా విద్యుత్ సౌకర్యమూ కనిపించదు. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఇక్కడి ప్రజలు దణ్ణాలు పెట్టి మరీ అడిగేది ఈ రెండు విషయాలనే!
ఈ రెండు అంశాలే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికల్లో ప్రధాన వాగ్దానంగా అన్ని పార్టీల్లోనూ చలామణి అవుతోంది. అలాంటి పల్నాడు ప్రాంతానికి చెందిన కీలక నియోజకవర్గం గురజాల. పల్నాటి యుద్ధంలో మాచర్ల వర్సెస్ గురజాల రాజ్యాల మధ్యే యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అలాగే ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు.. పార్టీల నేతలు అదే యుద్ధాన్ని తలపించేలా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి మారుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్‌రెడ్డి విజయం సాధించారు.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కాసు.. యువకుడు, ఉన్నత విద్యావంతుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చింది. మరీ ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలుగా పేరు పడ్డ కొన్ని ప్రాంతాలను అభివృద్ది దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. సీఎం జగన్‌తో తనకున్న సాన్నిహిత్యానికి సొంతానికి కాకుండా నియోజకవర్గం అభివృద్ధికి వినియోగిస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టి.. రాష్ట్రం తాలూకు వాటాని కూడా సాధించి అభివృద్ది పనులు ప్రారంభించారు. మండలాల వారీగా పనులను విభజించి.. పనులు చేపట్టేలా వ్యూహాత్మకంగా ముందుగానే నిధులు కేటాయించారు. ఫ్యాక్షన్ జోన్‌గా ముద్ర పడినప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు స్థాపించేలా యువతను ప్రోత్సహిస్తున్నారు.
తాగునీరు, విద్యుత్తు, రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. వయో వృద్ధులకు పింఛన్లు అందేలా చేస్తున్నారు. అదేసమయంలో ప్రతి 15 రోజులకు ఆయా గ్రామాల్లో పర్యటించారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఎన్నికలకు మాత్రమే కనిపించే ఎమ్మెల్యే ఇప్పుడు దాదాపు నెలకు రెండు సార్లుతమ దగ్గరకే వస్తుండడంతో ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు. దీంతో కాసు రేటింగ్ అధిరిపోయే రేంజ్‌లో ఉందని అంటున్నారు పరిశీలకులు.