ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తి అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిపి 18మందితో మంత్రివర్గం పరిపూర్ణమైంది. ఇంకెన్నాళ్లు.. అంటూ ఎదురుచూపులకు చెక్ పడింది. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం ఏర్పాటు సామాజిక సమతూకం పాటించారా..? లేదా..? అనే దానిపై ఎవరివాదనలు వారు వినిపిస్తున్నా.. మెజార్టీగా మాత్రం కేసీఆర్‌కే జై కొడుతున్నారు జనం. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు మహిళలకు రెండో కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించడంపై మహిళాలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది.
తాజాగా.. ఆదివారం చేపట్టి మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు కొత్తమంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో తెలంగాణ మంత్రివర్గం పరిపూర్ణమైంది. ఇక మిగిలింది పాలనను పరుగులు పెట్టించడమే. ముందస్తు ఎన్నికలకు వచ్చిన కేసీఆర్ ఘన విజయం సాధించారు. 2018 డిసెంబర్ 13 న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు అదే రోజున మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేయగా.. ఆయనకు హోంశాఖ అప్పగించారు.
ఆ తర్వాత రెండు నెలలు అవుతున్నా మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు 70 రోజులకు 2019 ఫిభ్రవరి18న మొదటి మంత్రి వర్గ విస్తరణ 10మందితో జరిగింది. తెలంగాణలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 119 ప్రకారం.. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. తాజాగా.. ఆరుగురు హరీశ్‌రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డిలతో మంత్రివర్గ విస్తరణ చేపట్టడంతో పరిపూర్ణమైంది.
ఇక తెలంగాణ మంత్రి వర్గంలో కూర్పులో సామాజిక సమతూకం కనిపిస్తోందని చెప్పొచ్చు. మంత్రి వర్గంలో… పురుషులు : 16 మహిళలు : 02.
వెలమ సామాజిక వర్గం : 4
రెడ్డి సమాజిక వర్గం : 6
కమ్మ సామాజిక వర్గం : 1
బీసీ సామాజిక వర్గం : 4 (మున్నూరు కాపు-1, గౌడ్ -1 యాదవ్-1, ముదిరాజ్-1) ఎస్సీ : 1 (మాల) ఎస్టీ : 1 (లంబాడా) ముస్లీం మైనార్టీ : 1
ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీశ్ రావు, కేటీఆర్ లు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. కాగా, ఇంద్రకరణ్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో దాదాపుగా అన్నిసామాజికవర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక జిల్లాల వారీగా చూస్తే.. ఉమ్మడికరీంనగర్ జిల్లా నుంచి అధికంగా నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించడం విశేషం. హైదరాబాద్ జిల్లా నుంచి ముగ్గురు మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇద్దరు ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు.