తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణ..?

-

తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణ జరగనుందా ? అది కూడా కేటీఆర్ కోసమే కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని రెండో సారి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆయనతో పాటు మహ్మద్ అలీ హోమ్ మంత్రిగా ప్రమాణం చేశారు. కానీ ఆ తర్వాత రెండు నెలలకు 10 మందితో కేసీఆర్ కేబినెట్ విస్తరించారు.

అయితే కేబినెట్ లో 17 మంది వరకు ఉండొచ్చు. ప్రస్తుతం 11 మందితో మంత్రివర్గం ఉంది. ఇక ఆరు మందితో లోక్‌సభ ఎన్నికలు ముగిశాక మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ లోక్ సభ ఎన్నికలు అయిపోయాయి, స్థానిక ఎన్నికలు కూడా అయిపోయాయి. ఇప్పటిలో మున్సిపల్ ఎన్నికలు తప్ప మరేమీ లేవు. ఈ తరుణంలోనే కేబినెట్ విస్తరణ తెరపైకి వచ్చింది. అది కూడా చాలామంది నేతలు కేటీఆర్ కేబినెట్ లో ఉంటే బాగుండేది అని ప్రతిపాదన తీసుకురావడంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం విస్తరణ దిశగా అడుగులేస్తోంది.

కేటీఆర్, హరీష్ రావుని కేబినెట్ లోకి తీసుకోవాలని పార్టీ వర్గాల్లో ముందు నుంచి డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే. హరీష్ కంటే ముందు కేటీఆర్ ని కేబినెట్ లోకి తీసుకోవాలని కీలక నేతలు కోరుతున్నారు.  ఈ మధ్య హోమ్ మంత్రి అలీ కేటీఆర్ మంత్రి అయితేనే మరిన్ని సేవలు చేస్తారని ఓ సభలో వ్యాఖ్యానించారు. అటు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కూడా కేటీఆర్ మంత్రిగా లేకపోవడం సిటీలో ఇబ్బందిగా ఉందని, త్వరగా ఆయనకి కేబినెట్ లో చోటు కల్పిస్తే బాగుతుందని కోరారు. గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ గ్రేటర్ లో బాగా పని చేసి పార్టీ బలోపేతానికి గానీ, అభివృద్ధికి గానీ మంచి సహకారం అందించారు.

కానీ ఇప్పుడు రెండో సారి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న కేటీఆర్ పార్టీ నాయకుడిగానే ఉన్నాడు. ప్రోటోకాల్ లేక‌పోవ‌డం వ‌ల్ల అధికారిక కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. పైగా నగరంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డామినేట్ చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ కి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చాలామంది నేతలు కోరుతున్నారు. సీఎం కేసీఆర్ మామూలుగా కేబినెట్ విస్తరణ చేస్తారా లేక కొడుకు కోసం కేబినెట్ విస్తరణ చేస్తారా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version