ఏపీలో ఇప్పుడు విద్యుత్ పీపీఏల సమీక్ష పేరుతో అధికార ప్రతిపక్షాల నడుమ విద్యుత్ మంటలు రాజుకుని అగ్గిలా మండుతున్నాయి. ఓవైపు ధరల సమీక్ష చేయాలని అధికార పార్టీ… అంత అవరమేమిచ్చింది అని ప్రతిపక్షాలు రోజు రాజకీయ పోరు చేసుకుంటుండగా.. ఇప్పుడు అధికార పార్టీకి మింగుడు పడని ఓ దురదృష్టం వెంటాడబోతుందా.. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారబోతుందా.. అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ప్రతిపక్షాలకు అందబోయే అస్త్రం ఏంటో ఓ సారి చూద్దాం..
ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఏపీలో విద్యుత్ సరఫరాపై గగ్గోలు పెడుతున్నాయి. అయితే త్వరలో ఏపీలో విద్యుత్ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.. దీనికి కారణం ఏపీలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు ఇప్పుడు బొగ్గు కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తెలంగాణలోని సింగరేణి నుంచి ఎక్కువ మొత్తంలో బొగ్గు సరఫరా అవుతుంది. అదే విధంగా మహానంది నుంచి కూడా బొగ్గు సరఫరా అవుతుంది. అయితే ఇటీవల సింగరేణిలో సమ్మెలు, ధర్నాలు జరిగిన నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. దీంతో ఏపీకి బొగ్గు సరఫరా కూడా తగ్గిందట.
అయితే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయట. దీంతో విద్యుత్ ఉత్పత్తికి భవిష్యత్‌లో అంతరాయాలు కలిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు లేఖలు రాసినట్లు సమాచారం. బొగ్గుసరఫరాలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషికి ఒక లేఖ కూడా రాసారు. ఆంధ్ర ప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడింది. భారీ వర్షాలు, కార్మికుల సమ్మె నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి బాగా పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ కు బొగ్గును సరఫరా చేసే సింగరేణి, మహానంది బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి తగ్గడంతో సరఫరా కూడా గణనీయంగా తగ్గింది. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. బొగ్గు ఆధారితంగానే థర్మల్ విద్యుత్ కేంద్రాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇంధనమే లేకపోవడంతో విద్యుతుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నుంచి 4 ర్యాకుల బొగ్గు ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది. ఈ సరఫరాను పెంచాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరారు. ప్రస్తుతం వస్తున్న 4 ర్యాకుల బొగ్గును 9ర్యాకులకు పెంచాలని కోరారు.
అంటే రాబోవు రోజుల్లో బొగ్గు సరఫరా తగినంత లేకపోతే విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడం, లో వోల్టేజీ సమస్యలు రావడం, ఉత్పత్తికి సరఫరాకు మధ్య తీవ్ర అంతరం ఉంటే ఏపీలో విద్యుత్ సమస్యలు తలెత్తక తప్పదు.. అప్పుడు ప్రతిపక్షాలకు ఇక జగన్ సర్కారు పై ఓ బ్రహ్మస్త్రం దొరికినట్లే.. సో ఇప్పుడు జగన్ సర్కారు ఈ బొగ్గు కొరతను ఎలా అధిగమిస్తుందో.. రాబోవు విద్యుత్ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కుతుందో, ప్రతిపక్షాలకు అవకాశం చిక్కకుండా ఎలా జాగ్రత్త పడుతుందో వేచి చూడాల్సిందే..