మోడీకి సవాల్ విసిరిన కేసీఆర్
గత పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. పాలమూరు జిల్లాలకు కన్నీళ్లు మిగిల్చారని తెరాస అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘70 ఏళ్ల నుంచి ఓట్లు వేస్తూనే ఉన్నారు. కానీ కల్వకుర్తి నియోజకవర్గానికి సాగు, తాగునీరు రాలేదు. ఎన్నికల్లో పార్టీలు, వ్యక్తులు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజలు గెలవాలి.. ప్రజల ఆకాంక్షలు గెలవాలి.. వారు కోరుకున్నది జరగాలి..తెలంగాణ ఉద్యమం సమయంలో తనను ఈనియోజకవర్గం ప్రజలు గెలిపించి పార్లమెంటుకు పంపారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ‘మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు రానివ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారు. పాలమూరు ఎత్తిపోతలను కడుతున్నాం. బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. పాలమూరు ఎత్తిపోతల కట్టొద్దంటూ బాబు కేసులు వేశారు.
హైదరాబాద్‍ని నేనే నిర్మించానని గొప్పలు చెప్పుకుంటన్న బాబు కరెంట్ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు అని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిని పూర్తి చేసి సాగునీరు తీసుకువస్తున్నాం. రాబోయే రెండేళ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరిస్తాం. ఈ ప్రాంతం నుంచి ఓ పెద్దాయన ‘కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు.. ఆయనకు తెలివి ఉందో తెలియదు.. మిషన్ భగీరథ కింద నీళ్లు రాలేదట. సో కాల్డ్ నాయకుల మాటల నమ్మి కన్ఫ్యూజ్ కావొద్దన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపించి వారి స్థాయిని పెంచి మీరు పెరగండి అంటూ కోరారు.
మోడీకి సవాల్ విసిరిన కేసీఆర్
మోడీ రమ్మంటే తాను మహబూబ్‌నగర్ నుంచి హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌కు వస్తానని, ఎక్కడ సమస్య ఉందో ప్రజలముందే తేల్చుకుందామన్నారు. పక్కపక్కనే సభలు నిర్వహిద్దాం..ప్రజల నుంచి ప్రశ్నలకు మీరు – నేను ఇద్దరం కలిసి సమాధానం చెబుదాం అంటూ ఛాలెంజ్ విసిరారు. ప్రధాని హోదాలో ఉన్న మీరు అన్ని అసత్యాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఎవరికీ భయపడబోనన్నారు. మోదీకి ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చారో గాని ఆయనంత తెలివితక్కువ ప్రధానిని చూడలేదని వ్యాఖ్యానించారు.