షాద్ నగర్ లో జరిగిన దిశా అత్యాచార సంఘటన తర్వాత మహిళల భద్రతపై దేశ వ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మహిళల భద్రత అనేది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. వెటర్నరి డాక్టర్ ని దారుణంగా హత్య చేయడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత నిందితులను తెలంగాణ పోలీసులు కాల్చి చంపడంతో ఈ వ్యవహారం సద్దుమణిగినా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు.
వరుసగా ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్లాన్ తో మహిళల రక్షణకు ముందుకి వచ్చే విధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూల్స్ కాలేజీల్లో మహిళల రక్షణకు సంబంధించి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనితో, దానిని ఒక సబ్జెక్ట్ గా చేర్చడమే కాకుండా, ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి,
ఆపద వచ్చినప్పుడు సాంకేతికను ఎలా వాడుకోవాలి, ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి, అనేవి ఒక పుస్తకంగా రూపొందించి ప్రత్యేకంగా అమ్మాయిలకు బోధించాలని, అందుకోసం వారంలో మూడు రోజుల పాటు ఒక గంట సాయంత్రం సమయంలో క్లాస్ తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించాలని కేసీఆర్ యోచిస్తున్నారట. అలాగే అమ్మాయిలకు సాయంత్రం ఆరు తర్వాత క్లాసులు రద్దు చేసే ఆలోచన కూడా తెలంగాణ సర్కార్ చేస్తున్నట్టు సమాచారం.