గండ్ర వ్యాఖ్యలను ఖండించిన సీఎం కేసీఆర్..

-

తెలంగాణ శాసన సభ సమావేశం చివరి రోజు సమావేశాలు కొనసాగుతున్న వేళ సీఎం కేసీఆర్ గండ్ర పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గవర్నర్ చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై కొనసాగుతున్న చర్చలో గండ్ర వెంకట రమణా రెడ్డి పదే పదే శాసనసభలో గవర్నర్ గురించి మాట్లాడుతూ… మీ గవర్నరంటూ సంభోదించడాన్ని సీఎం కేసీఆర్‌ ఖండించారు. వెంటనే స్పందించి … మీ కాదు… మా గవర్నర్‌ అనండని అని సీఎం చెప్పారు. తెరాస ప్రభుత్వం అంటూ సంబోధించడాన్ని తప్పు బట్టిన కాంగ్రెస్ వారిపై ఆయన తన దైన శైలిలో క్లాస్ తీసుకున్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంటే తప్పేంటి,…ఇప్పుడున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అనే పదం కాంగ్రెస్‌కు సహించట్లేదా? ఆత్మవంచన ఎందుకు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. దీంతో ఒక్క సారిగా సభ వేడెక్కిపోయింది.

చివరి  రోజు ఉదయం 10.30 నిమిషాలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశాలు ప్రారంభించారు. సభ ప్రారంభం కాగానే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తెదేపా నేత సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత సీఎల్పీగా ఎన్నికైన భట్టి విక్రమార్కకు స్పీకర్ అభినందనలు తెలిపారు. అనంతరం గవర్నర్ నరసింహన్ నిన్న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసిన ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ ప్రారంభమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version