సిరిసిల్ల నియోజకవర్గం అంటే కేటీఆర్ అడ్డా అనే సంగతి తెలిసిందే…అక్కడ కేటీఆర్కు రాజకీయంగా చెక్ పెట్టడం అంత ఈజీ కాదు. 2009లో కేవలం స్వల్ప మెజారిటీతో గెలిచిన కేటీఆర్..ఆ తర్వాత నుంచి సిరిసిల్ల నుంచి భారీ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 80 వేల ఓట్ల పైనే భారీ మెజారిటీతో గెలిచారు. అక్కడ కేటీఆర్కు చెక్ పెట్టడం ఎవరి వల్ల కాదు. కొంచెం గట్టిగా కష్టపడితే మెజారిటీ తగ్గించవచ్చు గాని..ఓడించడం మాత్రం చాలా కష్టం.
అయితే అక్కడ కేటీఆర్కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నారు. వరుసగా ఓడిపోతున్నా సరే ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ సారి సిరిసిల్ల బరిలో కేటీఆర్ని నిలువరించాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఉన్నట్లు కనిపించడం లేదు. నాయకుడు మహేందర్ రెడ్డి బలమైన వ్యక్తి. కాకపోతే సిరిసిల్లలో కాంగ్రెస్ వీక్ అవుతూ వస్తుంది. పైగా అక్కడ గ్రూపు గొడవలు ఉన్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హడావిడి ఎక్కువైంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని సిరిసిల్ల వేదికగానే నిర్వహిస్తున్నారు. అటు మహేందర్ రెడ్డి ఎలాగో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇదే క్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్లో కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్ రావు అలజడి మొదలైంది. గత నాలుగు ఏళ్లుగా ఉమేశ్ రావ్ కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. కానీ సడన్ గా ఎంట్రీ ఇచ్చి…సిరిసిల్లలో హడావిడి చేయడం మొదలుపెట్టారు.
తాజాగా నియోజకవర్గంలో కొందరు కార్యకర్తలతో భేటీ అయ్యి..కేటీఆర్ని ఓడించడమే తన లక్ష్యమని, కాంగ్రెస్ టికెట్ తనకే వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటన చేశారు. దీంతో సిరిసిల్ల కాంగ్రెస్లో కొత్త ట్రబుల్ మొదలైంది. ఇప్పటికే మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందించడం లేదు. ఈ క్రమంలో కేసీఆర్ మేనల్లుడు ఎంట్రీ ఇవ్వడంతో సిరిసిల్ల రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.