భారీ వరదలు.. ఆ 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

-

కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా నిన్న మరో ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. 11 జిల్లాలకు చెందిన 2 వేలమందికిపైగా సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. పది జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భారీ ఆస్తినష్టం సంభవించింది. రాష్ట్రంలో 23 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 71 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు, భారీ వర్షాల కారణంగా ఇడుక్కి, ముల్లపెరియార్ డ్యామ్‌లలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. జలాశయాల్లో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారు.

రాష్ట్రంలోని 9 జిల్లాలలో ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు మోహరించాయి. అలాగే, రెండు జిల్లాల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్‌ను మోహరించారు. భారీ వర్షాల నేపథ్యంలో శబరిమల యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. పంపానదిలో స్నానాలకు భక్తులను అనుమతించబోమని కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ తెలిపారు. ‘నిరపుథారి’ పండుగ కోసం బుధవారం ఆలయం తెరిచి ఉంటుందని, గురువారం పూజలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లోనూ ఆ జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. వర్షాల కారణంగా నేడు జరగాల్సిన కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తేదీలు ప్రకటిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version