కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. “సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంటల భీమా పథకం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ భీమా పథకం అమలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అన్నారు ఆయన.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి వరద బాధితులను, రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సూచించారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల విషయం తెలియగానే కేంద్రమంత్రి అమిత్ షాతో మాట్లాడానని చెప్పారు కిషన్ రెడ్డి. ఆయన వెంటనే రెండు ఆర్మీ హెలికాప్టర్లను, 10 ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను పంపించారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కాల్వలు కబ్జాలు కావడం, పూడిక తీత పనులు చేయకపోవడం వల్లే వరదలు ముంచెత్తాయని ఆరోపించారు. వరంగల్ నగరంలో ప్రతీయేటా వరదలు వస్తున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.