అంబర్‌పేటలో ఓటమే కిషన్‌ రెడ్డికి కలిసోచ్చిందా..?

-

నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేసిన జి.కిషన్‌రెడ్డి kishan reddy… ఆ ఘనత సాధించిన తెలంగాణ తొలి వ్యక్తిగా అరుదైన గుర్తింపు సాధించారు. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేని కిషన్‌ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి కార్యకర్త నుంచి కేంద్ర కేబినెట్‌ మంత్రి వరకు చేరుకున్నారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న కిషన్ రెడ్డి… రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు.

కిషన్‌రెడ్డి 1960లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌‌, వాజ్‌పేయీ ఆదర్శాలకు ఆకర్షితుడై అప్పటి జనతా పార్టీలో చేరారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఇక 1977లో రాజకీయాల్లోకి అర్రంగేట్రం చేసిన కిషన్‌రెడ్డి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. అనంతరం 1980లో బీజేపీ ఆవిర్భవించాక అందులో చేరారు.

కిషన్‌రెడ్డి/ kishan reddy

 

తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కార్వాన్‌ నుంచి పోటీ చేసిన కిషన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత 2004లో హిమాయత్‌నగర్‌ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కిషన్‌రెడ్డి… ఆ ఎన్నికలో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్‌పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు.

అయితే అప్పటికే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంచి నేతగా గుర్తింపు ఉన్న కిషన్‌రెడ్డికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తగిలింది. అంబర్‌పేటలో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. అయితే ఈ ఓటమే కిషన్‌రెడ్డికి కలిసొచ్చి… కేంద్ర కేబినెట్‌ మంత్రి పదవిని వరించేలా చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కిషన్‌రెడ్డి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మోదీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్న ఆయన.. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రి స్థాయికి ఎదిగారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version