దివ్యాంగులకు సమాన అవకాశాలను కల్పించడం కోసం అనేక సంస్కరణలు : కిషన్‌ రెడ్డి

-

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దివ్యాంగులు సాధించిన ఎన్నో విజయాలను మనం స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉంది. తమకున్న వైకల్యం గురించి కలత చెందకుండా సాధారణ వ్యక్తులకు ధీటుగా అనేక రంగాలలో దివ్యాంగులు సాధిస్తున్న ఎన్నో విజయాలు మనందరికీ చాలా స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.

దివ్యాంగులు స్వయం సంవృద్ధిని సాధించటానికి వీలుగా వారికి బాసటగా నిలుస్తూ నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 03 డిసెంబర్, 2015 న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ “సుగమ్య భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నేటికి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు సమాన అవకాశాలను కల్పించడం కోసం అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది.

అందులో భాగంగా మొదటగా వైకల్యంతో ఉన్న వారి గౌరవాన్ని కాపాడుతూ “వికలాంగులు” అన్న పదం స్థానంలో “దివ్యాంగులు” అనే పదాన్ని వాడాలని స్పష్టం చేయడం జరిగింది. దివ్యాంగుల హక్కులను కాపాడుతూ 1995 లో చేసిన చట్టంలో 7 వైకల్యాలకు మాత్రమే స్థానం ఉండగా, 2016 లో 21 వైకల్యాలకు స్థానం కల్పిస్తూ నూతన చట్టాన్ని రూపొందించటం జరిగింది. ఇందులో హిజ్రాలకు, మరుగుజ్జులకు, మాటలు మాట్లాడలేని, వినపడని వారికి కూడా స్థానం కల్పించడం జరిగింది. మొట్టమొదటి సారి మాట్లాడటంలో ఇబ్బందులు తలెత్తే భాషా వైకల్యాన్ని, నిర్ధిష్ట అభ్యాస వైకల్యాన్ని కూడా ఈ చట్టంలో చేర్చడం జరిగింది. దివ్యాంగుల కోసం నూతన డిక్షనరీని కూడా రూపొందించటం జరిగింది.

సుగమ్య భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సుగమ్య భారత్ యాప్ ను రూపొందించడం జరిగింది. డిజిటల్ రంగంలో దివ్యాంగులకు అవకాశాలను పెంపొందించడం కోసం ఈ యాప్ ను రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎవ్వరైనా, ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం 10 రకాల భాషలలో అందుబాటులో ఉంది. సంజ్ఞల ద్వారా కూడా దివ్యాంగులు ఈ యాప్ తో అనుసంధానం కావచ్చు.

దివ్యాంగులైన 1.84 లక్షలకు పైగా విద్యార్థులకు రూ. 555.35 కోట్ల స్కాలర్ షిప్ లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి వారి కలలను సాకారం చేయటానికి కృషి చేయడం జరిగింది. చిన్న పిల్లలలో వైకల్యాన్ని ముందుగానే గుర్తించి, వారికి తగిన సహాయం అందించటానికి వీలుగా 14 క్రాస్-డిస్ఎబిలిటీ ఎర్లీ ఇంటర్ వెన్షన్ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.

అక్టోబర్ 2021 వరకు 19.68 లక్షలకు పైగా దివ్యాంగులకు రూ. 1,182 కోట్ల విలువైన సహాయ పరికరాలను అందించడం జరిగింది. మాటలు పూర్తిగా వినిపించని వారికి తగిన చికిత్స ద్వారా మాటలు వినిపించేలా చేసే కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లను పెంచటానికి చర్యలు చేపట్టడం జరుగుతోంది. దీనికి, ఒక్కో ఆపరేషన్ కు దాదాపు 6 నుంచి 7 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది.

సులభంగా ఉపయోగించుకోవడానికి వీలుగా 1,630 ప్రభుత్వ కార్యాలయాలలో, 35 అంతర్జాతీయ, 55 దేశీయ విమానాశ్రయాలలో తగిన ఏర్పాట్లను చేయడం జరిగింది. 8,695 బస్సులలో పూర్తిగా, 1,45,747 బస్సులలో పాక్షికంగా దివ్యాంగుల సౌలభ్యానికి అనుగుణంగా మార్పులు చేయడం జరిగింది. 8.4 లక్షల పాఠశాలలో దివ్యాంగులకు వీలుగా ర్యాంపులను, చక్రాల కుర్చీలను, మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరిగింది.

నరేంద్రమోదీ ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం కారణంగా 2020 లో జరిగిన పారా ఒలింపిక్స్ లో భారత బృందం మునుపెన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో పతకాలను సాధించడం జరిగింది. 9 క్రీడలకు సంబంధించి మొత్తం 54 పారా క్రీడాకారులతో కూడిన భారత బృందం 5 బంగారు పతకాలను, 8 వెండి పతకాలను, 6 కాంస్య పతకాలను మొత్తం 19 పతకాలను కైవసం చేసుకోవడం జరిగింది.

ADIP పథకం క్రింద తెలంగాణ రాష్ట్రానికి గత 8 సంవత్సరాలలో రూ. 41 కోట్లకు పైగా నిధులను మంజూరు చేయగా, 30,107 మంది దివ్యాంగులకు సహాయ పరికరాలను అందించడం జరిగింది. తెలంగాణలో 7 ఆసుపత్రుల ద్వారా 371 మంది దివ్యాంగులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లను చేయించడం జరిగింది. దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో, తెలంగాణ వ్యాప్తంగా కూడా సుగమ్య భారత్ అభియాన్ పథకం క్రింద, ఏబీవీ ఫౌండేషన్ సహకారంతో వేలాదిమంది దివ్యాంగులకు సహాయపరికరాలను పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింతమంది దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలను అందించి, అవసరమైన వారికి చికిత్సలు కూడా చేయించటానికి వీలుగా చర్యలు చేపట్టడం జరుగుతుంది.

సిరిసిల్ల, హైదరాబాద్ లలో రూ. 2.55 కోట్ల విలువ గల సహాయ పరికరాలను అందించటానికి 3,816 మంది దివ్యాంగులను సర్వే ద్వారా గుర్తించడం జరిగింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి సహాయ పరికరాలు అవసరమున్న దివ్యాంగులకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ కేంద్రానికి పంపించలేదు. దివ్యాంగుల పట్ల కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విచారకరం. వీలయినంత త్వరగా ఈ ప్రతిపాదనలను పంపించాలని సంబంధిత అధికారులను కోరుతున్నాను.

దీన్ దయాళ్ రిహాబిలిటేషన్ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు సేవలను అందించే ఎన్జీవోలకు గత 8 సంవత్సరాల కాలంలో రూ. 832.73 కోట్లను విడుదల చేయడం జరిగింది. దీని ఫలితంగా 45,540 మంది దివ్యాంగులు లబ్ధి పొందారు.

ప్రీ – మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు, ఉన్నత విద్య, విదేశీ విద్య, ఫెలోషిప్ లు, ఉచిత కోచింగ్ వంటి వాటికి గత 8 సంవత్సరాలలో తెలంగాణకు రూ. 23.78 కోట్లను విడుదల చేయగా, 3696 మంది దివ్యాంగులైన విద్యార్థులు లబ్ధి పొందడం జరిగింది.

దివ్యాంగుల సాధికారత కోసం సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిస్ఎబిలిటీస్ (NIEPID) సంస్థకు గత 8 సంవత్సరాలలో రూ. 169.11 కోట్లను విడుదల చేయడం జరిగింది. యునిక్ డిస్ఎబిలిటీ ఐడి ప్రాజెక్టు క్రింద దివ్యాంగులకు ఒక యునిక్ ఐడి నంబర్ ను కేటాయించి జాతీయ స్థాయిలో ఒక డేటాబేస్ ను కూడా రూపొందించడం జరుగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లు దివ్యాంగులకు అందిస్తున్న ఈ సహకారాన్ని నూతనోత్సాహంతో కొనసాగిస్తూ, దివ్యాంగులకు సమానత్వంతో పాటు సమాన అవకాశాలను కలిగి ఉన్న దేశంగా భారత్ ను తీర్చిదిద్దటంలో ప్రతి ఒక్కరం మన వంతు సహకారాన్ని అందిద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version